అనంతపురం ఎడ్యుకేషన్: జేఈఈ అడ్వాన్స్‌డ్–2026 పరీక్షల్లో అనంతపురం నగరానికి చెందిన కోనంకి సమిత్ చౌదరి అదరగొట్టాడు. ఆలిండియా స్థాయిలో 62వ ర్యాంకుతో మెరిశాడు. దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీ ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే ఈ పరీక్షలో సమిత్ చౌదరి సాధించిన విజయం జిల్లా ప్రజలకు గర్వకారణంగా నిలిచింది. ప్రస్తుతం సమిత్ చౌదరి విజయవాడలోని శ్రీచైతన్య విద్యాసంస్థల గోసాల వేదవ్యాస్ భవన్‌లో ఇంటర్ చదివాడు. సమిత్ చౌదరి స్వగ్రామం శ్రీసత్యసాయి జిల్లా రామగిరి. తండ్రి కోనంకి అశోక్ కుమార్ గుడిబండ మండలం జంబులబండ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా, తల్లి అరుణాదేవి పెనుకొండ బాలికల ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. తన విజయానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహం, కృషి, క్రమశిక్షణే కారణమని సమిత్ చౌదరి తెలిపాడు.


