అనంతపురం అర్బన్: తహసీల్దార్ కార్యాలయాల్లో రెవెన్యూ సిబ్బంది అవినీతి తారస్థాయికి చేరింది. రెవెన్యూ సేవలకు వెలకట్టి.. జేబులు నింపుకుంటున్నారు. కొందరైతే కాసుల కోసం జలగల్లా పీడిస్తారనే విమర్శలు ఉన్నాయి. డబ్బులు చేతిలో పడితేనే ఫైళ్లు కదులుతాయనే విమర్శలు ఉన్నాయి. అక్రమార్జనలో కొందరు మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు (ఎంఆర్‌ఐ), గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్‌ఓ) రూ.కోట్లకు పడగలెత్తారనే ఆరోపణలు ఉన్నాయి. వీరి అవినీతిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వీరి అవినీతిపై 408 ఫిర్యాదులు అందాయి. ఇందులో 338 ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నట్లు.. 70 పెండింగ్‌లో ఉన్నట్లు అధికారిక నివేదిక స్పష్టం చేస్తోంది.
తహసీల్దారు కార్యాలయాల్లో ప్రతిపనికీ డబ్బులు వసూలు చేయడం సర్వసాధారణంగా మారింది. ఇక్కడి కొందరు అవినీతి సిబ్బందికి పైసలిస్తేనే పనులు జరిగే పరిస్థితి నెలకొంది. కార్యాలయానికి వచ్చే ప్రజలు, రైతుల అవసరాన్ని బట్టి వసూలు మొత్తం పెరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా అడంగల్, 1బి సవరణలు, పట్టాదారు పాసు పుస్తకం మంజూరు, మ్యుటేషన్, సర్వే నంబరు కరెక్షన్, సబ్ డివిజన్, ఇలా ప్రతి పనికీ డబ్బులు గుంజుతారనే ఆరోపణలు బహిరంగంగానే వినవస్తున్నాయి.
తహసీల్దారు కార్యాలయాల్లోని కొందరు అవినీతి సిబ్బందికి 22ఎ (నిషేధిత భూములు), 08 (చుక్కల భుములు), మిగులు భూమి కరెక్షన్ ఫైళ్లు కల్పతరువుగా మారి కాసులు కురిపిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఫైలు సిద్ధం చేయడం ప్రారంభించడంతోనే డబ్బులు వసూలు ప్రక్రియ సమాంతరంగా మొదలవుతుందనే ఆరోపణలు ఉన్నాయి. అవినీతి సిబ్బందిపై ప్రజాసమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్, ఇతర అధికారులకు ప్రతి వారం ఒకటో రెండో ఫిర్యాదులు వస్తూనే ఉంటాయి.
రెవెన్యూ సేవలను ఆదాయ వనరుగా మార్చుకున్న అక్రమార్కుల కదలికలపై ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) నిఘా ఉంచింది. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఏసీబీ ఉద్యోగి ఒకరు వచ్చి సాధారణ వ్యక్తిలా పరిసరాల్లో తిరుగుతుంటాడు. వివిధ సమస్యలపై వచ్చే ప్రజలతో, ముఖ్యంగా రైతులతో ఆ ఉద్యోగి మాట్లాడతాడు. ఏం పనిమీద వచ్చావు.. తహసీల్దారు కార్యాలయంలో పని ఎందుకు కాలేదు.. అక్కడ ఎవరైనా డబ్బులు ఇవ్వాలని అడిగారా.. ఎంత అడిగారు...? వంటి వివరాలను ఆ ఉద్యోగి సేకరిస్తాడు. ఇలా ఆదాయానికి మించిన ఆస్తులు, బినామీలకు సంబంధించి అవినీతి ఉద్యోగుల జాబితాను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
అడిగినంత డబ్బులిస్తేనే ఫైళ్లలో కదలిక కాసుల కోసం జలగల్లా పీడిస్తున్న వైనం ఆర్‌ఐలు, వీఆర్‌ఓలపై ఫిర్యాదుల వెల్లువ అక్రమార్కుల ఆర్థిక వ్యవహారాలపై ఏసీబీ నిఘా
కల్పతరువుగా 22ఎ, 08 ఫైళ్లు..
ప్రతివారం ఏసీబీ నిఘా..
ప్రతి పనికీ పైసావసూల్..


