చిత్రావతిలో ఇసుక రీచ్‌ వద్దు | - | Sakshi
Sakshi News home page

చిత్రావతిలో ఇసుక రీచ్‌ వద్దు

Jun 2 2026 3:12 AM | Updated on Jun 2 2026 3:12 AM

ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌కు రైతుల వినతి

అనంతపురం అర్బన్‌/యల్లనూరు: చిత్రావతి నదిలో ఇసుక రీచ్‌ను రద్దు చేయాలని యల్లనూరు రైతులు కోరారు. సోమవారం కలెక్టరేట్‌ వద్ద రైతులు బాలరంగయ్య, ఓబుళేసు, నారాయణస్వామి మీడియాతో మాట్లాడారు. కోడుమూర్తి గ్రామ పొలం సర్వే నంబరు 67–2ఏ, 68లో 3.90 ఎకరాలను గంపయ్యగారి పెద్ద నాగముని పేరున పట్టా భూమిగా చూపి ఇసుక రీచ్‌ మంజూరు చేశారన్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం అది బంజరు భూమి అన్నారు. రెవెన్యూ అధికారులు తప్పుడు నివేదికలతో ఇసుక రీచ్‌ మంజూరు చేయడం సరికాదన్నారు. ఆ సర్వే నంబర్లలోనే కాకుండా చిత్రావతిలో 20 అడుగుల లోతుకు తవ్వుతున్నారన్నారు. విషయాన్ని తహసీల్దారు దృష్టికి తీసుకెళితే తనకు సంబంధం లేదని సమాధానం ఇచ్చారన్నారు. చిత్రావతి నది ఒడ్డున పండ్ల తోటలు, తాగునీటి బోర్లు ఉన్నాయని, ఇష్టారీతిన ఇసుక తవ్వకంతో భూగర్భ జలాలు అడుగంటి రైతులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఇసుక రీచ్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌కు రైతులు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో రైతులు రమేస్‌, శివయ్య, వీరప్ప, పెద్ద రామాంజనేయులు, ఓబుళయ్య, తదితరులు పాల్గొన్నారు.

ఆలయాల ఆదాయ పెంపే లక్ష్యం

ఉరవకొండ: దేవాలయాల స్థిరాస్తులపై ఆదాయం పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని దేవదాయ శాఖ రాష్ట్ర కమిషనర్‌ రామచంద్రమోహన్‌ తెలిపారు. సోమవారం ఉరవకొండ గవిమఠంతోపాటు ప్రసిద్ధ పర్యాటక పుణ్యక్షేత్రం పెన్నహోబిలాన్ని కమిషనర్‌ పరిశీలించారు. గవిమఠం ఉత్తరాధికారి డాక్టర్‌ కరిబసవరాజేంద్రస్వామి, జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌ గంజి మల్లికార్జునప్రసాద్‌ ఆధ్వర్యంలో అర్చకులు ఆయనను ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ భక్తులకు సౌకర్యవంతమైన, సంతృప్తికర దర్శనం కల్పించడానికి కృషి చేస్తున్నామన్నారు. గవిమఠం భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లోని భూములు, ఆస్తులు కాపాడతామన్నారు. కార్యక్రమంలో కర్నూలు ఏసీ రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు.

నేరేడు మొక్కల నరికివేత

తాడిపత్రి రూరల్‌: ప్రత్యర్థులను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ఎంచుకున్న విష సంస్కృతి తాడిపత్రి ప్రాంతంలో మళ్లీ మొదలైంది. ఫ్యాక్షన్‌ ప్రభావిత గ్రామమైన ఆలూరులో పోలీసు బందోబస్తు ఉన్నా చెట్ల నరికివేత చోటు చేసుకోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. గ్రామంలో వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు గోసు రామచంద్రారెడ్డి మూడు ఎకరాల విస్తీర్ణంలో 280 నేరేడు మొక్కలు పెంచుతున్నాడు. ఇందులో 200 మొక్కలు సోమవారం తెల్లవారుజామున నరికివేతకు గురయ్యాయి. బాధితుడు తోటను పరిశీలించిన అనంతరం ఇది రాజకీయ కక్షసాధింపులో భాగంగానే జరిగిందని నిర్ధారణకు వచ్చారు. టీడీపీకి చెందిన రవిచంద్రారెడ్డి, వరప్రసాద్‌రెడ్డి, బ్రహ్మయ్య, రమేష్‌, యోగీంద్రతోపాటు మరికొందరు కలిసి నేరేడు చెట్లను కొడవళ్లతో నరికివేశారని, వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అప్‌గ్రేడ్‌ స్టేషన్‌ సీఐ శివగంగాధర్‌రెడ్డి తెలిపారు. విషయం తెలిసిన మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఫోన్‌ చేసి గోసు రామచంద్రారెడ్డితో మాట్లాడి సంఘటనా వివరాలను అడిగి తెలుసుకున్నారు.

40 సపోట చెట్ల నరికివేత: ఆలూరు గ్రామంలో రాజకీయాలకు దూరంగా, తటస్థంగా ఉంటున్న రైతు సుబ్బారెడ్డికి చెందిన 40 సపోట చెట్లను ఎవరో నరికివేశారు. తమకు ఎవరితోనూ శత్రుత్వం లేదని, ఈ పని ఎవరో చేశారో తెలియడం లేదని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Advertisement
 
Advertisement
Advertisement