షేర్‌ మార్కెట్‌ లాభాల ఆశ చూపి కుచ్చుటోపీ | - | Sakshi
Sakshi News home page

షేర్‌ మార్కెట్‌ లాభాల ఆశ చూపి కుచ్చుటోపీ

Jun 2 2026 3:12 AM | Updated on Jun 2 2026 3:12 AM

అనంతపురం సెంట్రల్‌: షేర్‌ మార్కెట్‌లో లాభాల ఆశ చూపి ప్రజలకు కరూ.25 కోట్లకు పైగా కుచ్చుటోపీ పెట్టిన ఓ వ్యక్తి ఉదంతం వెలుగులోకి వచ్చింది. నిండా మోసపోయిన బాధితులు సోమవారం ఎస్పీ కార్యాలయానికి వచ్చి తమ గోడు వెలిబుచ్చారు. బాధితుల కథనం మేరకు... బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన నరేష్‌కుమార్‌రెడ్డి అనంతపురం నగరం సాయినగర్‌లో ఆరిజన్‌ సొల్యూషన్‌ పేరుతో ఓ కంపెనీ ఏర్పాటు చేశాడు. సదరు కంపెనీలో పెట్టుబడులు పెడితే షేర్‌ మార్కెట్‌, ఆన్‌లైన్‌ బిజినెస్‌ ద్వారా మంచి లాభాలు తీసుకొచ్చి మీ డబ్బును పదింతలు చేస్తానని నమ్మబలికాడు. ఇందుకు ఎక్కువ శాతం విద్యావంతులైన తన స్నేహితులను, కంపెనీలో పనికి కుదుర్చుకున్న సిబ్బందిని, బంధువులను వాడుకున్నాడు. తొలుత కొద్ది రోజుల పాటు పెట్టిన పెట్టుబడికి రూ.5, రూ.10లు చొప్పున వడ్డీ(లాభాల రూపంలో) చెల్లించాడు. డబ్బులు బాగా ఇస్తున్నాడు.. అందులోనూ తెలిసిన వ్యక్తేనన్న నమ్మకంతో బాధితులు వారికి తెలిసిన వాళ్లతో సైతం కంపెనీలో పెట్టుబడులు పెట్టించారు. ఇలా ఒక్కొక్కరు రూ.4 లక్షలు మొదలుకుని రూ.60 లక్షలు, రూ.90 లక్షలు.ఇలా పెట్టుబడులు పెట్టారు. అయితే కొన్ని నెలల నుంచి నరేష్‌ కుమార్‌ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఫోన్‌లు స్విచ్‌ ఆఫ్‌ చేసుకున్నాడు.

బాధితుల వేదన వర్ణనాతీతం..

చాలామంది స్నేహితుల దగ్గర అప్పుగా, బ్యాంకు లోన్లు, బంగారు తాకట్టు పెట్టి రుణాలు తీసుకుని నరేష్‌కుమార్‌రెడ్డికి ఇచ్చారు. ఇప్పుడు డబ్బులు తిరిగి రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి కొట్టుమిట్టాడుతున్నారు. నగరంలోని బళ్లారి బైపాస్‌లో నివాసముంటున్న ప్రధానోపాధ్యాయుడు భాస్కర్‌బాబు కూడా బ్యాంకులు, లోన్‌ యాప్‌లలో డబ్బులు తీసుకొని దాదాపు రూ.60 లక్షలు పెట్టుబడి పెట్టాడు. నిండా మోసపోయిన ఇతను నెలనెలా ఈఎంఐలు చెల్లించలేక, ఒత్తిళ్లు తాళలేక కూడేరు మండలం కమ్మూరు సమీపంలోని ఓ వెంచర్‌లో సూసైడ్‌నోట్‌ రాసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి బాధితులు వందల్లో ఉన్నారు. తమకు న్యాయం చేయాలని, నిందితుని నుంచి డబ్బులు వసూలు చేయాలని బాధితులు పోలీసులను వేడుకుంటున్నారు.

రూ.90 లక్షలు నష్టపోయాం

ఆరిజన్‌ సొల్యూషన్‌ కంపెనీలో రూ.90 లక్షల వరకూ పెట్టుబడి పెట్టాను. మా దగ్గర ఉన్న బంగారు మొత్తం తాకట్టు పెట్టాం. తెలిసిన వాళ్ల దగ్గర అప్పుగా తెచ్చి కూడా ఇచ్చాం. లాభాలు దండిగా వస్తాయని నరేష్‌కుమార్‌రెడ్డి ఆశ చూపాడు. తొలినాళ్లలో డబ్బులు సక్రమంగా ఇవ్వడంతో మరింత అప్పు చేసి ఇచ్చాం. మా లాంటి ఎంతోమంది బాధితులు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులే న్యాయం చేయాలి.

– నాగవేణి, ఆత్మకూరు మండలం

నిండా ముంచిన

ఆరిజన్‌ సొల్యూషన్‌ కంపెనీ

రూ.25 కోట్లకు పైగా వసూలు

బాఽధితుల్లో ఎక్కువ శాతం నిర్వాహకుడి స్నేహితులు, బంధువులే

లబోదిబోమంటూ

ఎస్పీ కార్యాలయానికి...

Advertisement
 
Advertisement
Advertisement