రాయదుర్గంటౌన్: తాగునీటి కోసం రాయదుర్గం పట్టణ ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. పది రోజులకు ఒకసారి మాత్రమే అదీ అరకొరగా కొళాయిలకు నీరు వదులుతున్నారు. అవి ఎవ్వరికీ చాలకపోవడంతో కష్టాలు పెరిగిపోతున్నాయి. సోమవారం 19వ వార్డు అంబేడ్కర్ కాలనీ మహిళలు ఖాళీ బిందెలతో బీటీపీ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ట్యాంకర్లు కూడా పంపకపోతే తాగునీటి అవసరాలు ఎలా తీరుతాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ ఏఈ నరసింహులు, సిబ్బంది అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. ట్యాంకర్ పంపించి ఆందోళనను విరమింపజేశారు.


