అనంతపురం టౌన్: తెలుగుదేశం పార్టీలో ముస్లిం మైనార్టీ నాయకుల మనుగడ కష్టతరంగా మారింది. పార్టీకోసం కష్టపడి పనిచేస్తున్న తమను రాజకీయంగా ఎదగకుండా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆటంకాలు సృష్టిస్తున్నారంటూ ముస్లిం మైనార్టీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన రెండేళ్ల కాలంలో వివక్ష, దాడులకు గురయ్యామని అంటున్నారు. ఆయన ఆగడాలను తెలుపుతూ నాయకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న వీడియోలు వైరల్‌గా మారాయి.
● నగరంలోని సాయినగర్‌లో అస్రా కంటి ఆస్పత్రి భవనాన్ని ఎమ్మెల్యే అనుచరులే డబుల్ రిజిస్ట్రేషన్ చేయించి.. ఆపైన నిర్వాహకులైన ముస్లిం మైనార్టీ కుటుంబంపై దాడులకు సైతం తెగబడ్డారు. రూ.కోట్లు విలువ చేసే స్థలాన్ని, భవనాన్ని కాజేయాలనే కుట్రలు చేశారు. ఒక దశలో ఎమ్మెల్యే నేరుగా మహిళా డాక్టర్ భర్త షరీఫ్‌కు ఫోన్ చేసి ‘చెప్పుతో కొడతా ల.. కొడకా. ఎమ్మెల్యే గురించి మాట్లాడతావా? ఎమ్మెల్యే బావమరిది గురించి మాట్లాడతావా? నీ కథ చూస్తా’నంటూ బెదిరింపులకు పాల్పడ్డారు.
● నగరంలోని ఆజాద్‌నగర్‌కు చెందిన టీడీపీ నాయకుడు నూర్‌మహమ్మద్ రంజాన్ మాసం పురస్కరించుకొని ఇఫ్తారు విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఒక నాయకుని ఫొటో ఫ్లెక్సీలో లేదని స్థానిక నేతలు ఎమ్మెల్యేను విందుకు రాకుండా అడ్డుకున్నారు. దీన్ని జీర్ణించుకోలేని మైనార్టీ నాయకుడు నూర్ మహమ్మద్ ఆత్మహత్యాయత్నం చేశాడు.
నాకేమైనా జరిగితే ఎమ్మెల్యేనే కారణం..
టీడీపీ కోసం కష్టపడి పని చేసినా గుర్తింపు లేదంటూ ముస్లిం మైనార్టీ నాయకుడు సైఫుద్దీన్ కన్నీటి పర్యంతమయ్యాడు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నుంచి తనకు ప్రాణహాని ఉందని తెలిపాడు. ‘నాకు జరిగిన అన్యాయం గురించి బహిరంగంగా మాట్లాడితే ఎమ్మెల్యే, ఆయన అనుచరులు జీర్ణించుకోలేక దాడులకు తెగబడుతున్నారు. నాకు గానీ, నా కుటుంబ సభ్యులకు గానీ ఏమైనా జరిగితే ఎమ్మెల్యేనే కారణ’మంటూ ఆయన తీసుకున్న సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మమ్మల్ని మీరే కాపాడండి..
‘అనంతపురం అర్బన్ నియోజకవర్గం పరిధిలోని రాజీవ్ కాలనీ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో రూ.లక్షల్లో ఖర్చు పెట్టి పోటీ చేశాను. సార్వత్రిక ఎన్నికల్లో దగ్గుపాటి ప్రసాద్ గెలుపు కోసం అహర్నిశలూ శ్రమించాను. కానీ నేనేమీ పని చేయలేదంటూ ఎమ్మెల్యే దూషణలకు దిగుతున్నారు. మీరే మమ్మల్ని కాపాడండి’ అంటూ సర్పంచ్ అభ్యర్థి నబిరసూల్ చంద్రబాబు, లోకేష్‌లను వేడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇవే కాదు నియోజకవర్గ వ్యాప్తంగా ముస్లిం మైనార్టీ నాయకులపై ఎమ్మెల్యే వివక్ష చూపుతున్నారని ముస్లింలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీలో ముస్లింల మనుగడ కష్టమే
తమకేమైనా జరిగితే ఆయనే కారణం
వైరల్ అవుతున్న ముస్లిం మైనార్టీ నాయకుల వీడియోలు


