‘ముంగారు’కు వేళాయె | - | Sakshi
Sakshi News home page

‘ముంగారు’కు వేళాయె

Jun 1 2026 4:07 AM | Updated on Jun 1 2026 4:07 AM

అనంతపురం అగ్రికల్చర్‌: కీలక ఖరీఫ్‌ (ముంగారు) సీజన్‌ సోమవారం నుంచి ప్రారంభమవుతోంది. ఎల్‌–నినో కారణంగా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటూ ప్రభుత్వం, వ్యవసాయశాఖ మూడు నెలలుగా విస్తృత ప్రచారం చేస్తుండటంతో రైతుల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తుతున్నాయి. ఈ క్రమంలో నైరుతి రుతుపవనాలు (సౌత్‌వెస్ట్‌ మాన్‌సూన్స్‌) కూడా ఇంకా పలకరించలేదు. ఈ వారాంతంలోపు ‘నైరుతి’ ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ‘నైరుతి’ ప్రభావంతో కురిసే వర్షాలపై ఖరీఫ్‌ ఆధారపడింది.

ఈ ఖరీఫ్‌లో అన్ని రకాల పంటలు 3.43 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగులోకి వస్తాయని అధికారులు అంచనా వేశారు. అందులో ప్రధానపంట వేరుశనగ 1,47,382 హెక్టార్లు ఉండగా, ఆ తర్వాత కంది 78,274 హెక్టార్లు, పత్తి 42,119 హెక్టార్లు, మొక్కజొన్న 21,659 హెక్టార్లు, ఆముదం 17,490 హెక్టార్లుగా ఉంది. నీటి వసతి కింద 22,868 హెక్టార్లలో వరి నాట్లు వేసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇలా ఐదు ప్రధాన పంటలతో పాటు జొన్న, సజ్జ, రాగి, కొర్ర, పెసర, ఉలవ, అలసంద, మినుము, సోయాబీన్‌, పొద్దుతిరుగుడు వంటి 20 నుంచి 22 రకాల పంటలు సాగులోకి రావచ్చని అంచనాలు తయారు చేశారు.పంటలు సకాలంలో సాగులోకి రావాలంటే రుతపవనాలు ప్రభావం చూపి జూన్‌ 15 నుంచి జూలైలో మంచి వర్షాలు పడాలి. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు నాలుగు నెలల కాలాన్ని ఖరీఫ్‌గా పరిగణిస్తారు. ఈ నాలుగు నెలల కాలంలో 321.5 మి.మీ సాధారణ వర్షం నమోదు కావాలి. మొత్తం ఏడాది పొడవునా 512.5 మి.మీ సాధారణ వర్షపాతంగా నిర్ధారించారు.

జిల్లాలో 4,03,454 మంది రైతులు ఉన్నారు. అందులో ఒక హెక్టారులోపున్న చిన్నకారు రైతులు 1,27,584 మంది ఉండగా, ఒకటి నుంచి 2 హెక్టార్ల లోపున్న సన్నకారు రైతులు 1,47,044 మంది ఉన్నారు. ఇక రెండు నుంచి నాలుగు హెక్టార్ల లోపున్న మధ్యస్థ రైతులు 1,03,793 మంది ఉండగా, 4 నుంచి 10 హెక్టార్ల వరకు ఉన్న ఓ మాదిరి రైతులు 22,952 మంది, 10 హెక్టార్లు, అంతకన్నా ఎక్కువ కలిగిన పెద్ద రైతులు 2,081 మంది ఉన్నట్లు గణాంకాలు వెల్లడిన్నాయి.

ఖరీఫ్‌ మొదలైనా చంద్రబాబు ప్రభుత్వం రైతులకు సాయం చేయడానికి ముందుకు రావడం లేదు. సకాలంలో విత్తనం, ఎరువులు, అన్నదాత సుఖీభవ, ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఇన్సూరెన్స్‌, పావలావడ్డీ, యంత్రపరికరాలు లాంటి వాటి రూపంలో సాయం చేయడానికి మనసు రావడం లేదు. పంట పెట్టుబడులకు అవసరమైన డబ్బు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

జిల్లాకు 56 వేల క్వింటాళ్ల రాయితీ విత్తనం కేటాయించి, విత్తన వేరుశనగకు 40 శాతం సబ్సిడీ ప్రకటించారు. కానీ ఇప్పటివరకు విత్తన పంపిణీ ప్రక్రియ మొదలు కాలేదు. పాత బకాయిలు రూ.90 కోట్లు ఇస్తే కానీ తాము ఖరీఫ్‌కు విత్తనం సరఫరా చేయలేమని ప్రాసెసింగ్‌ప్లాంట్ల నిర్వాహకులు తెగేసి చెబుతున్నారు. గతేడాది మాదిరిగా ఈసారి కూడా కంది, మొక్కజొన్న, ఆముదం విస్తీర్ణం పెరిగే అవకాశం ఉన్నా రైతులకు మేలైన విత్తనం అందే పరిస్థితి కనిపించడం లేదు. ఇక వేరుశనగతో పాటు ప్రధాన పంటలు విత్తుకునేందుకు జూన్‌ 15 నుంచి జూలై ఆఖరు వరకు సరైన సమయమని ఏఆర్‌ఎస్‌, కేవీకే ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్‌ ఎం.విజయశంకరబాబు, డాక్టర్‌ సాధినేని మల్లీశ్వరి, జేడీఏ ఎన్‌.సాలురెడ్డి తెలిపారు.

నేటి నుంచి ఖరీఫ్‌–2026

3.43 లక్షల హెక్టార్లలో పంటల సాగు అంచనా

ఎల్‌–నినో, ప్రతికూల పరిస్థితుల్లో

ఆలస్యంగా ‘నైరుతి’

ఇంకా మొదలు కాని రాయితీ

విత్తన వేరుశనగ పంపిణీ

విత్తన పంపిణీ ఎప్పుడో..?

3.43 లక్షల హెక్టార్లు అంచనా..

4.03 లక్షల మంది రైతులు..

పెట్టుబడులకు తప్పని ఇబ్బందులు..

Advertisement
 
Advertisement
Advertisement