నేడు కలెక్టరేట్‌లో ‘పరిష్కార వేదిక’ | - | Sakshi
Sakshi News home page

నేడు కలెక్టరేట్‌లో ‘పరిష్కార వేదిక’

Jun 1 2026 4:07 AM | Updated on Jun 1 2026 4:07 AM

అనంతపురం అర్బన్‌: కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో సోమవారం ఉదయం 9 గంటలకు ప్రజాసమస్యల పరిష్కారవేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ఆనంద్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. భూసమస్యలపై అర్జీలను పరిష్కార వేదికలో భాగంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్‌లో అందజేయాలని సూచించారు. అర్జీ వెంట ఆధార్‌, ఫోన్‌ నంబర్‌ తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. కాల్‌సెంటర్‌ 1100కు ఫోన్‌ చేసి ప్రజలు తమ అర్జీ పరిష్కార స్థితిని తెలుసుకోవచ్చన్నారు.

కొనసాగుతున్న గాలివాన

అనంతపురం అగ్రికల్చర్‌: జిల్లాలో గాలివాన కొనసాగుతోంది. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు 21 మండలాల పరిధిలో 15.5 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. గుత్తిలో 55.8, రాప్తాడు 41, యాడికి 40, తాడిపత్రి 40.2, అనంతపురం రూరల్‌ 39.4, అనంతపురం అర్బన్‌ 37, పుట్లూరు 36.6, బుక్కరాయసముద్రం 34, యల్లనూరు 31.4, నార్పల 28.4, గార్లదిన్నె 23.6, బెళుగుప్ప 18.2, కళ్యాణదుర్గం 13.2 మి.మీతో పాటు పామిడి, పెద్దపప్పూరు, శింగనమల, కంబదూరు, ఆత్మకూరు, కూడేరు, కణేకల్లు, పెద్దవడుగూరు తదితర మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. 20 నుంచి 25 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీయడంతో అక్కడక్కడ అరటి పంట దెబ్బతినగా... నగరంలో పెద్ద పెద్ద చెట్లు సైతం పడిపోయాయి. పెద్ద చెట్లతో పాటు విద్యుత్‌ స్తంభాలు పడిపోయాయి. ఆదివారం సాయంత్రం విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించారు. నైరుతి రాకమునుపే తొలకరి వర్షాలు పలకరిస్తున్నాయి. ఎల్‌–నినో అంటూ భయపెడుతున్నా ముందస్తు వర్షాలతో రైతులు ఖరీఫ్‌ సాగుకు సన్నద్ధమవుతున్నారు. రాగల రెండు రోజులు కూడా జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

ప్రైవేట్‌ కళాశాలల్లో

బోగస్‌ హాజరుకు చెక్‌

ముఖ ఆధారిత హాజరు తప్పనిసరి

75 శాతం అటెండెన్స్‌ లేకపోతే

ఫీజురీయింబర్స్‌మెంట్‌ కట్‌

అక్రమార్జనకు కోత

తాడిపత్రి రూరల్‌: ప్రైవేట్‌ కళాశాలల్లో ముఖ ఆధారిత హాజరు (ఫేషియల్‌ అటెండెన్స్‌) విధానం తప్పనిసరి చేస్తూ ఉన్నత విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లూ బోగస్‌ హాజరు నమోదు చేసి.. విద్యార్థులకు మంజూరయ్యే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సొమ్ము చేసుకుంటున్న పలు కళాశాలలకు ఈ నిర్ణయం శరాఘాతంగా మారింది. జిల్లాలో 57 ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలు, 14 ఇంజినీరింగ్‌ కళాశాలలు, 14 బీఈడీ కాలేజీలు, 35 ఎంబీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ, ఎంఏ, ఎం.కామ్‌ కోర్సులు అందించే కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలలన్నింటిలోనూ ఉదయం, సాయంత్రం వేళల్లో ఫేషియల్‌ అటెండెన్స్‌ అమలు చేయనున్నారు.

ఎవరికి ఇబ్బంది అంటే...

ప్రైవేట్‌ కళాశాలల్లో అడ్మిషన్‌ తీసుకున్న వారిలో కొందరు నేరుగా తరగతులకు హాజరవుతున్నారు. మరికొందరు గైర్హాజరవుతూ యాజమాన్యంతో ‘మేనేజ్‌’ చేయించుకుంటున్నారు. ఇంకొందరు ఉద్యోగాలు చేసుకుంటూ ఖాళీ సమయాల్లో తరగతులకు హాజరయ్యేవారూ ఉన్నారు. ఇక డిగ్రీ, పీజీ, బీటెక్‌, ఎంటెక్‌, ఏంసీఏ, ఏంబీఏ తదితర కోర్సులు చదువుతున్న వారిలో అర్హులైన వారికి ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పొందాలంటే 75 శాతం హాజరు తప్పనిసరి. ఇలా తరగతులకు హాజరుకాని వారితో కళాశాల యాజమాన్యాలు లోపాయికారి ఒప్పందం చేసుకుని తగినంత ‘హాజరు’ వేస్తూ యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటూ వస్తున్నాయి. ఇకమీదట 75 శాతం హాజరు లేకపోతే ఫీజురీయింబర్స్‌మెంట్‌ వర్తించదు. దీంతో ఆయా కళాశాలలు అక్రమార్జనను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Advertisement
 
Advertisement
Advertisement