తనయుడి మరణంతో ‘తల్లి’డిల్లి.. | - | Sakshi
Sakshi News home page

తనయుడి మరణంతో ‘తల్లి’డిల్లి..

Jun 1 2026 4:07 AM | Updated on Jun 1 2026 4:07 AM

అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు అర్ధంతరంగా తనువు చాలించడం ఆ తల్లి జీర్ణించుకోలేకపోయింది. ఎప్పుడూ ఆడుతూ పాడుతూ కనిపించే తనయుడు విగతజీవిగా పడి ఉండటాన్ని ఆ హృదయం తట్టుకోలేకపోయింది. నువ్వులేని లోకంలో నేనుండలేనంటూ ఉరివేసుకుని ప్రాణం తీసుకుంది. తల్లీకుమారుడి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

కళ్యాణదుర్గం రూరల్‌ (కంబదూరు): ఈతకెళ్లి యువకుడి మృతి చెందగా.. కుమారుడి మరణవార్త విని తట్టుకోలేక తల్లి ఉరివేసుకున్న సంఘటన కంబదూరులో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. కంబదూరు మండల కేంద్రలో నివాసం ఉండే అనిత, హనుమంతు దంపతులు. వీరు వడ్డే పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి అజయ్‌ (16) కుమారుడు, కుమార్తె అశ్విని ఉన్నారు. పదో తరగతి పూర్తి చేసిన అజయ్‌ ఆదివారం స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలో తోటలో ఏర్పాటు చేసిన నీటి ట్యాంక్‌లో ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ నీట మునిగి మృతి చెందాడు. వెంటనే స్థానికులు మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కుమారుడి మరణవార్తతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి అనిత (37)ను కుటుంబ సభ్యులు, బంధువులు ఓదార్చేందుకు ప్రయత్నించారు. కుమారుడి మరణం తట్టుకోలేక గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఒకేసారి ఇద్దరి మరణంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. వారిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు.

ఈతకెళ్లి బాలుడి మృతి

తట్టుకోలేక తల్లి ఆత్మహత్య

Advertisement
 
Advertisement
Advertisement