విద్యతోనే సమాజంలో సముచిత స్థానం | - | Sakshi
Sakshi News home page

విద్యతోనే సమాజంలో సముచిత స్థానం

Jun 1 2026 4:07 AM | Updated on Jun 1 2026 4:07 AM

వైన్‌ షాపులో చోరీ

యాడికి: మండల పరిధిలోని రాయలచెరువులో అయ్యప్పస్వామి దేవాలయం వెనుక భాగాన ఉన్న బ్రాందీ షాపులో శనివారం రాత్రి చోరీ జరిగింది. శనివారం రాత్రి దుండగులు వైన్‌ షాపు వెనుక భాగంలో గోడ పైన కన్నం వేసి షాపు లోపలికి చొరబడి రూ.2 లక్షల మద్యం బాటిళ్లు, రూ.23 వేల నగదును ఎత్తుకెళ్లారు. సీఐ శ్రీనివాసులు ఆదివారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌ టీమ్‌ సభ్యులు చోరీ జరిగిన చోట వేలి ముద్రలు సేకరించారు.

అనంతపురం ఎడ్యుకేషన్‌: విద్యతోనే సమాజంలో సముచిత స్థానం లభిస్తుందని బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా కురుబ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక గుత్తి రోడ్డులోని కనకదాస కల్యాణ మండపంలో నిర్వహించిన కనకదాస ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి మంచి ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రులకు, సమాజానికి, కురుబ కులానికి ఉపయోగపడాలన్నారు. సివిల్స్‌ చదవాలనుకునే విద్యార్థులకు ఉచిత కోచింగ్‌ అందించేందుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి మాట్లాడుతూ సివిల్స్‌ కోచింగ్‌ కోసం ఢిల్లీ వెళ్లే విద్యార్థులకు ఉచిత వసతి సదుపాయం కల్పిస్తామని తెలిపారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ మాట్లాడుతూ విద్యా పరంగా అభివృద్ధి చెందినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని, విద్యార్థులు అహర్నిశలు శ్రమించాలని సూచించారు. కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్కే మల్లికార్జున మాట్లాడుతూ మారుమూల గ్రామాల విద్యార్థులు కూడా విద్యలో రాణిస్తుండటం హర్షణీయమన్నారు. ఇంటెలిజెన్స్‌ ఎస్పీ వెంకటరాముడు మాట్లాడుతూ విద్యార్థులు ఐఏఎస్‌, ఐపీఎస్‌ వంటి ఉన్నత లక్ష్యాలను సాధించి సమాజానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పదో తరగతి, ఇంటర్‌లో ప్రతిభ చాటిన కురబ విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో కురుబ సంఘం జిల్లా అధ్యక్షులు తుప్పటి ఈశ్వరయ్య, డాక్టర్‌ కేసీ మహేష్‌, మాస్టర్‌ మైండ్స్‌ బసవయ్య, డెప్యూటీ డీఈఓ లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement