అనంతపురం అగ్రికల్చర్: రైతులకు ఇతోధికంగా సేవలందించేందుకు ఏర్పాటు చేసిన ఆర్‌బీకే/ఆర్‌ఎస్‌కేలను చంద్రబాబు ప్రభుత్వం కుదించింది. 25 శాతం కేంద్రాలను మూసేయడంతో రైతులు వ్యవసాయ సేవలు పొందడానికి ఇబ్బందులు తప్పేలా లేవు. వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి దేశంలోనే లేనివిధంగా రైతు బాగోగులే లక్ష్యంగా 2020లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గ్రామగ్రామాన రైతు భరోసా కేంద్రాలు (ఆర్‌బీకే) ఏర్పాటు చేశారు. వ్యవసాయం, పట్టు, పాడి, పశుపోషణ, మత్స్య, ఉద్యాన, మార్కెటింగ్, ఏపీఎంఐపీ తదితర వ్యవసాయ అనుబంధ రంగాలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి రైతులు ఊరు దాటకుండా అన్ని రకాల సేవలూ ముంగిటకే అందించారు. వన్‌స్టాప్ హెల్ప్ సెంటర్లుగా విత్తు నుంచి విపత్తు వరకు, పంట సాగు నుంచి విఫణిలో పంట అమ్ముకునే దాకా రైతులకు విశేష సేవలు అందిస్తూ వచ్చాయి. ఆర్‌బీకే వేదికగా గ్రామస్థాయి పంట ప్రణాళిక అమలు చేస్తూ అడుగడుగునా రైతులకు అండగా ఉండేలా తీర్చిదిద్దారు. వాటిని ఆధునిక హంగులతో సర్వాంగ సుందరంగా సొంత భవనాలు నిర్మించారు. పల్లెసీమల్లో ఆర్‌బీకేలు రైతులకు ఆలయాలుగా మారిపోయాయి. అలా ఒకే విడతగా అనంతపురం జిల్లాలో ఏకంగా 451 ఆర్‌బీకేలు ఏర్పాటు చేసి.. అక్కడ వీఏఏ, వీహెచ్‌ఏ, వీఎస్‌ఏలను రెగ్యులర్ ప్రాతిపదికన నియమించారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఆర్‌బీకేల ద్వారా రైతులకు అందుతున్న సేవల గురించి దేశంలో ఉన్న పలు రాష్ట్రాలు, అలాగే విదేశీ బృందాలు సందర్శించి ప్రశంసలు గుప్పించాయి. అయితే చంద్రబాబు నేతృత్వంలో కొలువుదీరిన ప్రభుత్వం ఆర్‌బీకేలను ఆర్‌ఎస్‌కేలు పేరు మార్చేసింది. జగన్‌కు మంచి పేరు వస్తుందనే అక్కసుతో ఆర్‌ఎస్‌కేల నిర్వీర్యం చేస్తూ వచ్చింది. ఏడాది కిందట హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) అంటూ కొత్త అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చింది. ఆర్‌ఎస్‌కేల సంఖ్యను పెంచాల్సింది పోయి తగ్గించడం గమనార్హం. హేతుబద్ధీకరణ ఏ ప్రాతిపదికన చేశారో కూడా తెలియని విధంగా మొదట 15 ఆర్‌ఎస్‌కేలను తొలగించారు. తర్వాత వాటి సంఖ్య 125కి చేరింది. గతంలో జిల్లా వ్యాప్తంగా 451 ఆర్‌బీకేలు ఉండగా.. అందులో 125 మూతపడటంతో వాటి సంఖ్య 326కు పడిపోయింది. అందులో 126 ఆర్‌ఎస్‌కేల్లో వీఏఏలు, 180 ఆర్‌ఎస్‌కేలో వీహెచ్‌ఏలు, 12 ఆర్‌ఎస్‌కేల్లో వీఎస్‌ఏలు అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారు. అర్బన్ ప్రాంతాల్లో ఉన్న 8 ఆర్‌ఎస్‌కేల్లో ఎంపీఈఓలను నియమించారు. రెండేళ్లు తిరగకుండానే ఏకంగా 125 ఆర్‌ఎస్‌కేలను మూసివేయడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు రాయితీ విత్తన వేరుశనగ, యూరియా, డీఏపీ లాంటి ఎరువులు, ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ పరికరాల కోసం గ్రామం వదలి వేరే గ్రామాలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. విత్తు, విపత్తు సమయాల్లో సకాలంలో సేవలు అందే పరిస్థితి కనిపించడం లేదని రైతులు వాపోతున్నా చంద్రబాబు సర్కారు పట్టించుకునే పరిస్థితి లేదు. మూతవేసిన ఆర్‌ఎస్‌కే గ్రామాల్లో ఇప్పుడు విత్తన వేరుశనగ సరఫరా చేస్తారా లేదా వేరే గ్రామాలకు అటాచ్ చేస్తారా అనేది కూడా అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు.
హేతుబద్ధీకరణ పేరుతో
ఆర్‌ఎస్‌కేల కుదింపు
451 నుంచి 326కు తగ్గిన
ఆర్‌ఎస్‌కేల సంఖ్య
వన్‌స్టాప్ హెల్ప్ సెంటర్లుగా జగన్ హయాంలో రైతులకు విశిష్ట సేవలు
125 ఆర్‌బీకేలు మూత..


