● బాలుడిని రక్షించే క్రమంలో
యువతి మృతి
ఉరవకొండ: పెళ్లింట విషాదం నెలకొంది. కళ్ల ముందే నీటిలో కొట్టుకుపోతున్న బాలుడిని కాపాడేందుకు యత్నించిన యువతి మృతితో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. వివరాలు.. ఉరవకొండ పట్టణంలోని పార్కు ఆంజినేయస్వామి ఆలయం వద్ద నివాసముంటున్న రత్నమాచారి, కళావతి దంపతులకు నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. ఈనెల 7న పెద్ద కుమార్తె నీరజకు మంత్రాలయంకు చెందిన కాళప్ప ఆచారి కుమారుడితో వివాహం జరిగింది. ఇరువురు కుటుంబ సభ్యులు ఈనెల 30న మంత్రాలయంలోని వరుడి ఇంట్లో సత్యనారాయణ పూజ ఏర్పాటు చేశారు. పూజ కోసం వెళ్లిన బంధువులు స్నానం కోసం తుంగభద్ర నదికి వెళ్లారు. పుష్కర ఘాట్ సమీపంలో స్నానాలకు దిగారు. ఇందులో హైదరాబాద్‌కు చెందిన సతీష్‌చంద్రతో పాటు అతని ఐదేళ్ల కుమారుడు యువన్ ఉన్నారు. యువన్ నీటిలో మెల్లగా కొట్టుకుపోవడం గమనించిన రత్నమాచారి, కళావతి దంపతుల మూడో కుమార్తె సంధ్య నదిలో దిగి చిన్నారిని కాపాడే ప్రయత్నం చేసింది. అయితే నీటి ప్రవాహం ఎక్కవగా ఉండటంతో సంధ్య కూడా నీటిలో కొట్టుకుపోయింది. సంధ్య బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉంది. ఎంతో భవిష్యత్తు ఉన్న తమ అమ్మాయి చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు వెళ్లి మృత్యువాత పడటం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.
విద్యుదాఘాతంతో
గొర్రెల కాపరి మృతి
కళ్యాణదుర్గం రూరల్ (కంబదూరు): వ్యవసాయతోటకు ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్‌ను తాకి గొర్రెల కాపారి మురళి (42) మృతి చెందిన సంఘన కంబదూరు మండల పరిధిలోని రాళ్లపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు వివరాల మేరకు.. కంబదూరు మండలం రాళ్లపల్లి గ్రామానికి చెందిన మురళి గొర్రెలు మెపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం ఉదయం కూడా గొర్రెలను మోపుకుంటూ వెళ్లాడు. వ్యవసాయ తోట రక్షణగా ఏర్పాటు చేసిన విద్యుత్ వైరును ప్రమాదశాత్తూ తాకడంతో విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య అక్కమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
బస్సు ఢీకొని ఒకరి మృతి
కనగానపల్లి: మండల పరిధిలోని పర్వతదేవపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసుల వివరాలమేరకు.. పర్వతదేవరపల్లికి చెందిన బాబాసాహెబ్ (65) ఆదివారం రాత్రి 7.30 సమయంలో నడుచుకొంటూ జాతీయ రహదారి దాటుతున్నాడు. ఆ సమయంలో బెంగుళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.


