వలస కూలీల వాహనం బోల్తా
● బాలుడితో సహా డ్రైవర్ దుర్మరణం
రాప్తాడు రూరల్: వలస కూలీలతో బయల్దేరిన వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో బాలుడితో సహా డ్రైవర్ దుర్మరణం చెందాడు. వివరాలిలా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన 23 మంది కూలీలు కేరళలో ఉపాధి కోసం శుక్రవారం రాత్రి క్రూషర్ వాహనంలో బయలుదేరారు. శనివారం తెల్లవారుజామున రాప్తాడు మండల పరిధిలోని కార్బన్ సిటీ వద్ద 44వ జాతీయ రహదారికి రాగానే అదుపుతప్పి వాహనం బోల్తాపడింది. భారీ రాళ్ల మధ్య పల్టీలు కొట్టడంతో కూలీలందరూ చెల్లాచెదురుగా పడిపోయారు. ఎవరు ఎక్కడ ఉన్నారో, ఏమి జరిగిందో అర్థం కాని పరిస్థితి. చీకటిలో సహాయం కోసం పలువురు ఆర్తనాదాలు చేశారు. ఈ ప్రమాదంలో కూలి పనుల కోసం వెళ్తున్న మహిపాల్ (16) అక్కడి కక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు తీవ్రంగా గాయపడిన డ్రైవర్ రంజిత్ యాదవ్ (21)ను స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇద్దరి కలలు, ఆశలు, కుటుంబాల భవిష్యత్తు ఒక్క క్షణంలో రోడ్డుపైనే చిధ్రమయ్యాయి. ఇంటి వద్ద వారి కోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు ఈ వార్త గుండెల్ని పిండేసే విషాదంగా మారింది. ప్రమాదంలో గాయపడిన పలువురు కూలీలను స్థానికులు, పోలీసులు, 108 సిబ్బంది సకాలంలో స్పందించి అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు.
పలు మండలాల్లో మోస్తరుగా
వర్షపాతం నమోదు
లోతట్టు ప్రాంతాలు జలమయం
అనంతపురం అగ్రికల్చర్: వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించిన తరుణంలో అనంతపురం నగరంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. పగలంతా ఉక్కపోతతో సూరీడు సెగలు పుట్టించినా.. సాయంత్రానికి వరుణుడు చల్లబరిచాడు. ఒక్కసారిగా భారీ ఉరుములు, మెరుపులకు తోడు 20 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. దాదాపు గంటకు పైగా ఏకధాటిగా వర్షం కురిసింది. జనజీవనం స్తంభించిపోయింది. దీంతో నగరంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రెయినేజీలు పొంగిపొర్లాయి. పలు లోతట్టు ప్రాంతాలు, శివారు కాలనీల్లోకి వర్షపు నీరు చేరడంతో జనం ఇబ్బంది పడ్డారు. అనంతపురంలో 40 మి.మీ మేర వర్షం పడగా.. అనంతపురం రూరల్ మండలం, తాడిపత్రి, గుత్తి, నార్పల, యల్లనూరు, పుట్లూరు, శింగనమల, బుక్కరాయసముద్రం, రాప్తాడు, పెద్దపప్పూరు, కూడేరు, బ్రహ్మసముద్రం, బెళుగుప్ప, గార్లదిన్నె తదితర మండలాల్లో కూడా మోస్తరుగా వర్షపాతం నమోదైంది. 20 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో అక్కడక్కడా పంట నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు. నైరుతి రుతుపవనాలు రాకమునుపే ముందస్తుగా తొలకరి వర్షాలు పడుతుండటంతో ఖరీఫ్ సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఎల్లో అలర్ట్ నేపథ్యంలో రాగల మూడు రోజులు వర్షంతో పాటు ఈదురుగాలులు వీచే సూచన ఉన్నట్లు శాస్త్రవేత్తలు
తెలిపారు.


