దుర్గంలో దాహం కేకలు | - | Sakshi
Sakshi News home page

దుర్గంలో దాహం కేకలు

May 31 2026 12:24 AM | Updated on May 31 2026 12:24 AM

రాయదుర్గంటౌన్‌: ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ప్రాతినిధ్యం వహిస్తున్న రాయదుర్గంలో తాగునీటి ఎద్దడి తారస్థాయికి చేరింది. నెలకు మూడు సార్లు కూడా కుళాయిలకు నీరు వదలడం లేదు. రెండు నెలలుగా పరిస్థితి అధ్వానంగా మారింది. విసుగుచెందిన బీటీపీ రోడ్డు, మొలకాల్మూరు రోడ్డు, లక్ష్మీబజార్‌, మధుటాకీస్‌ ఏరియా తదితర ప్రాంతాల మహిళలు ఆందోళనబాట పట్టారు. గత శుక్రవారం ఓబుళాచారి రోడ్డు, నేతాజీరోడ్డు, గోసాబావి వీధికి చెందిన మహిళలు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపారు. తాజాగా శనివారం ఐదో వార్డు మహిళలు సచివాలయం వద్ద ఖాళీ బిందెలతో ఆందోళన చేశారు. ఆందోళన చేసిన ఏరియాలకు మాత్రం వెంటనే ట్యాంకర్లు పంపుతున్నారని, మరి తమ పరిస్థితి ఏమిటని మిగతా ప్రాంతవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు చెబుతున్న కారణాలివే..

కణేకల్లులోని సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు నుంచి రాయదుర్గానికి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హెచ్చెల్సీ శాశ్వత మంచినీటి పథకం ద్వారా తాగునీటిని అందిస్తున్నారు. తరచూ కరెంటు సరఫరాలో అంతరాయం, ఎస్‌ఎస్‌ ట్యాంకు నుంచి వీరాపురం వద్ద గల పంప్‌ హౌస్‌ వరకు విద్యుత్‌ లైన్‌ లోపంతో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతోందని అధికారులు చెబుతున్నారు.

సమీక్షలతోనే సరి.. పరిష్కారమేదీ?

డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మంచినీటి పథకం కింద మరో మూడు నెలలకు సరిపడ నీరు అందుబాటులో ఉన్నా రాయదుర్గం పట్టణవాసులకు నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. సమీక్షలతోనే అధికారులు, పాలకులు సరిపెడుతున్నారు గానీ క్షేత్రస్థాయిలో తాగునీటి సమస్య పరిష్కారం కావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. వేసవి ప్రారంభం నుంచే సరైన ప్రణాళిక లేకపోవడమే తాగునీటి సమస్యకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. అవసరమైన చోట్ల బోర్లు వేసి కనీసం అవసరాలకు వినియోగించే నీటిని డిస్ట్రిబ్యూషన్‌ లైన్లకు లింక్‌ ఇస్తే సమస్య కాస్త అదుపులోకి వచ్చేది. దీంతోపాటు పట్టణంలో విరివిగా బోర్లు ఏర్పాటు చేసి సిస్టన్‌ ట్యాంకులు ఏర్పాటు చేసినా ఉపశమనం లభించేది. గతంలో నీటిని అందించిన పాత బోర్లు నేటికీ నిరుపయోగంగా ఉన్నాయి. వీటిపై దృష్టి సారించకపోవడం కూడా నిర్లక్ష్యంగా ప్రజలు పేర్కొంటున్నారు. విద్యుత్‌ సరఫరా లోపాలు అధిగమించే దిశగా చర్యలు తీసుకోకపోవడంలోనూ మీనమేషాలు లెక్కిస్తున్నారు.

రాయదుర్గం పురపాలక సంఘంలో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. పది రోజులకోసారి కూడా కుళాయిలకు తాగునీరు రావడం లేదు. సమస్యను అధిగమించడంలో పాలకులు, అధికారులు విఫలమవుతున్నారు. మహిళలు ఎక్కడికక్కడ రోడ్డెక్కి

నిరసనలు తెలుపుతున్నారు. అయినా పరిస్థితిలో మార్పు రావడం లేదు.

పది రోజులకోసారి కూడా

నీరు రాని దుస్థితి

రెండు నెలలుగా

మహిళల ఆందోళనబాట

సమస్య పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

నీరు సక్రమంగా వదలాలి

కాలనీలకు రెండు నెలలుగా తాగునీరు సకమ్రంగా రావడం లేదు. తాగునీటి విడుదల ఆలస్యమైన రోజుల్లో కనీసం ట్యాంకర్‌ నీరు కూడా పంపడం లేదు. అధికారులు స్పందించి నీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలి.

– నాయకుల సుధ, గాంధీనగర్‌ కాలనీ, రాయదుర్గం

తాగునీటి సరఫరా మెరుగుకు చర్యలు

విద్యుత్‌ అంతరాయం, పైప్‌లైన్‌ లీకేజీలతో నీటి సరఫరాలో జాప్యం జరుగుతోంది. విద్యుత్‌ సరఫరా లోపాన్ని నివారించేందుకు అధికారులతో సమీక్షించాం. ఒకే ఫీడర్‌తో విద్యుత్‌ సరఫరా చేసేలా కృషి చేస్తాం. ప్రస్తుతం ఉన్న ట్యాంకర్ల సంఖ్య పెంచుతాం.

– దివాకర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌, రాయదుర్గం

Advertisement
 
Advertisement
Advertisement