అనంతపురం టౌన్: భూములు అమ్ముకోవాలంటే వెధవల పర్మిషన్ కావాలట. ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా అని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌చౌదరి ధ్వజమెత్తారు. నగరంలో రౌడీయిజం చేస్తామంటే ఊరుకునేది లేదంటూ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌కు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. శనివారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నగరంలో భూకబ్జాలు అధికమయ్యాయని, దీనిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులుతోపాటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. త్వరలోనే కలెక్టరుకు లిఖిత పూర్వకంగా ఆధారాలతో ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. టీడీపీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలు ప్రస్తుతం వేధింపులకు గురవుతున్నారని, అలాంటి వారికి తాను అండగా ఉంటానని చెప్పారు. జేసీ, పరిటాల కుటుంబాలతో రాజకీయ విభేదాలే తప్ప వ్యక్తిగత విభేదాలు ఏవీ లేవన్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఒక వ్యక్తి గ్రాఫ్‌తోనే ఎన్నికల్లో గెలుపొందినట్లు అహంకారంతో చంకలు గుద్దుకుంటున్నాడన్నారు. కార్యకర్తలందరి రెక్కల కష్టంతోనే పార్టీ విజయం సాధించిందని గుర్తు చేశారు. అదే గ్రాఫ్‌తో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలిపించి సదరు వ్యక్తి సత్తా ఏంటో చూపిస్తే సంతోషపడతామన్నారు. 2029 సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తానన్నా పోటీ చేయబోనని అధిష్టానానికి తెలియజేశానన్నారు. నగరంలో పార్టీకి మైలేజ్ తీసుకొచ్చానని చెప్పుకుంటున్న వ్యక్తులే పోటీ చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు.
నగరంలో రౌడీయిజం చేస్తామంటే ఊరుకునేది లేదు
ఎమ్మెల్యే దగ్గుపాటిపై పరోక్షంగా ధ్వజమెత్తిన ప్రభాకర్ చౌదరి


