రైతులు కష్టపడి పండించిన పంటలను నేరుగా కొనుగోలుదారులకు విక్రయిస్తే తగిన గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉంటుందనే సదుద్దేశంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గుంతకల్లులో నిర్మించిన రైతు బజార్... ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యం కారణంగా నిరుపయోగంగా మారింది. 2024, ఫిబ్రవరి 23న ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ రైతు బజార్‌లో గదులను అన్నదాతలకు ఉచితంగా కేటాయించాల్సి ఉంది. అయినా నేటికీ ఎలాంటి కార్యాచరణ లేకపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గుంతకల్లు టౌన్: రైతులు పండించిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను స్వయంగా వారే విక్రయించుకునేందుకు వీలుగా రూ.50 లక్షల మార్కెట్ కమిటీ నిధులతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గుంతకల్లులో అధునాతన రైతు బజార్‌ను నిర్మించింది. 2024, ఫిబ్రవరి 23న అప్పటి ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి ప్రారంభించారు. ఈ లోపు ఎన్నికలు రావడంతో రైతు బజార్ ప్రజా వినియోగంలోకి రాలేకపోయింది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుబజార్‌ను పూర్తిగా గాలికొదిలేసింది.
మార్కెట్‌కు వెళ్లాలంటే 3 కి.మీ దూరం..
పట్టణ శివారు కాలనీలైన దోనిముక్కల రోడ్డు ఇందిరమ్మకాలనీ, జగనన్న కాలనీలు, జగ్జీవన్‌రామ్, టీచర్స్‌కాలనీ, సీఐటీయూ, శ్రీనివాసనగర్, బర్మశాల, ప్రశాంతినగర్ తదితర కాలనీలకు చెందిన ప్రజలు ప్రస్తుతం మెయిన్ రోడ్డుకు సమీపంలో ఉన్న మార్కెట్‌కు కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు తదితరాలు కొనుగోలు చేయడానికి వెళుతుంటారు. కనీసం 2 నుంచి 3 కి.మీ దూరం ప్రయాణించాల్సి రావడంతో ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ఒక్కసారి ఆటోలో వెళ్లి రావాలంటే రూ.100 వరకు ఖర్చవుతోంది. దీంతో ఇళ్ల వద్దకు కూరగాయాలను తీసుకొచ్చే వ్యాపారులకు అధిక ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్ యార్డులో నిర్మించిన రైతుబజార్‌ను వినియోగంలోకి తెస్తే శివారు ప్రాంత ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుంది.
కలగా మారిన డీజీ రైతు బజార్
అధునాతన వసతులతో నిర్మించిన రైతుబజార్‌లో క్రయవిక్రయాలకు సంబంధించి గదులను రైతులకు పూర్తి ఉచితంగా కేటాయిస్తారు. దీనికి తోడు ఆధునిక సాంకేతికతను అంది పుచ్చుకున్న మార్కెట్ యార్డు... ప్రత్యేకంగా డీజీ రైతు బజార్ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్ ద్వారా తమకు అవసరమైన కాయగూరలు, ఆకు కూరలు, పండ్లు తదితరాలను వినియోగదారులు బుక్ చేసుకుంటే వారి ఇంటి వద్దకే వాటిని సరఫరా చేయనున్నారు. అయితే రెండుళ్లు గడిచినా రైతు బజార్‌లో క్రయవిక్రయాలు సాగకపోవడంతో డీజీ రైతు బజార్ యాప్ కాస్త కలగా మారింది.
అధునాతన వసతులు కలిగిన గుంతకల్లులోని వైఎస్సార్ రైతు బజార్, రైతులు స్వయంగా పంట ఉత్పత్తుల విక్రయాలు సాగించేందుకు నిర్మించిన గదులు
రైతులే స్వయంగా పంట ఉత్పత్తులు విక్రయించుకునే వెసులుబాటు
గత ప్రభుత్వంలో పూర్తయిన రైతు బజార్
ఎన్నికల కోడ్ రాకతో
ప్రారంభానికే పరిమితం
ఆ తర్వాత పట్టించుకోని చంద్రబాబు సర్కార్
ప్రకటనలకే పరిమితమైన
డీజీ రైతు బజార్ యాప్


