తాడిపత్రి టౌన్: స్వీయ రక్షణ సామర్థ్యాలు పెంపొందించుకోవాలని మహిళలకు ఎస్పీ జగదీష్ పిలుపునిచ్చారు. మహిళలు, చిన్నారుల భద్రతకు జిల్లాలో చేపట్టిన ఆపరేషన్ దండయాన్ కార్యక్రమంపై తాడిపత్రిలో ఐసీడీఎస్, అంగన్‌వాడీ, పొదుపు సంఘాల మహిళలకు శుక్రవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. శక్తి యాప్, మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు. గృహ హింస, మహిళలపై వేధింపులు, బాల్య వివాహాలు, సైబర్‌మోసాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అపరిచిత వ్యక్తులఫోన్ కాల్స్‌కు స్పందించరాదని, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచకోకూడదని సూచించారు. సమస్య ఎదురైతే భయపడకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అనంతరం పోలీస్ శాఖకు సంబంధించిన వివిధ పోస్టర్లను విడుదల చేసారు. ఈ సందర్భంగా ఎస్పీని తాడిపత్రి వాసవీ క్లబ్బు సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఏఎస్పీ రోహిత్‌కుమార్, సీఐలు శివగంగాధర్‌రెడ్డి, ఆరోహణరావు, రామసుబ్బయ్య, మార్కెట్‌యార్డు చైర్మన్ భూమా నాగరాగిణి, న్యాయవాదులు జ్యోతి, ఫరీదా, నబీనా, ఎస్‌ఐలు ధరణి, గౌష్, దయాకర్, చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
జంగంరెడ్డిపల్లిలో
విషాద ఛాయలు
శింగనమల(నార్పల): నార్పల మండలం జంగంరెడ్డిపల్లిలో శుక్రవారం విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన ఫర్టిలైజర్ వ్యాపారి కురుబ రాజా, లక్ష్మీదేవి దంపతుల ఏకైక కుమారుడు యశ్వంత్ కుమార్(17) విజయవాడలోని శ్రీచైతన్య కళాశాలలో చదువుతూ అదే కళాశాలలో గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆగమేఘాలపై విజయవాడకు తరలి వెళ్లారు. కాగా, శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదివిన యశ్వంత్‌కుమార్ బెటర్‌మెంట్ పరీక్షలు రాయడానికి వెళ్లాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.
అరటి తోట దగ్ధం
వజ్రకరూరు: మండలంలోని గంజికుంట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, రైతు ఆవుల వెంకట్రాముడు అరటి తోట మంటల్లో దగ్ధమైంది. శుక్రవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు రాజేయడంతో మంటలు చెలరేగాయి. ఉరవకొండ నుంచి అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు ఆర్పే లోపు నాలుగు ఎకరాల్లోని 7 వేల అరటి చెట్లు, డ్రిప్ పరికరాలు, పైపులు, మోటారు కాలిపోయాయి. ఘటనతో రూ.20 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధిత రైతు వాపోయాడు.


