కక్ష సాధింపు చర్యలు తగదు | - | Sakshi
Sakshi News home page

కక్ష సాధింపు చర్యలు తగదు

May 30 2026 3:14 AM | Updated on May 30 2026 3:14 AM

వైఎస్సార్‌సీపీ పీఆర్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి

అనంతపురం: ప్రశ్నించిన వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగడం సరైన పద్ధతి కాదంటూ చంద్రబాబు ప్రభుత్వానికి వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి హితవు పలికారు. జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖరరెడ్డిని శుక్రవారం ఆయన ములాఖత్‌లో కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రజా వ్యతిరేక పాలనను ప్రశ్నిస్తున్నందుకే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి కుటుంబంపై చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. రాజకీయ ఒత్తిళ్లు, అక్రమ కేసులు, అరెస్టులతో భయపెట్టాలనుకోవడం సీఎం చంద్రబాబు అవివేకానికి నిదర్శనమన్నారు. ఇలాంటి చర్యలతో ప్రజల హక్కుల పరిరక్షణకు వైఎస్సార్‌సీపీ నిరంతర సాగిస్తున్న పోరాటం మరింత ఉధృతంగా మారుతుందని హెచ్చరించారు.

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

అనంతపురం టౌన్‌: గృహ నిర్మాణ సంస్థలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులను ఔట్‌సోర్సింగ్‌ విధానంలో భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తున్న ఆ సంస్థ పీడీ శైలజ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 4 డేటా ఎంట్రీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్‌ కోర్సు పూర్తి చేసిన వారు అర్హులు. మెరిట్‌, రిజర్వేషన్‌ ఆధారంగా అర్హులను ఎంపిక చేయనున్నారు. www. ananthapuramu.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడు చేసుకున్న దరఖాస్తులను భర్తీ చేసి జూన్‌ 10వ తేదీలోపు గృహ నిర్మాణ సంస్థ కార్యాలయంలో అందజేయాలి. పూర్తి వివరాలకు 08554–274456 లో సంప్రదించవచ్చు.

విత్తనశుద్ధి మొదలు

పెట్టండి : జేడీఏ

అనంతపురం అగ్రికల్చర్‌: విత్తన పంపిణీ ప్రక్రియలో భాగంగా వెంటనే విత్తనశుద్ధి మొదలు పెట్టాలని ప్రాసెసింగ్‌ యూనిట్ల నిర్వాహకులను జేడీఏ సాలురెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఏపీ సీడ్స్‌ జిల్లా మేనేజర్‌ వెంకటసుబ్బయ్య, టెక్నికల్‌ ఏఓ రాకేష్‌నాయక్‌తో కలిసి అనంతపురంలోని విజయ, రామకృష్ణ మిల్లులను ఆయన సందర్శించారు. బకాయిలు విడుదల చేసే అవకాశం ఉన్నందున రైతులకు ఇబ్బంది లేకుండా విత్తనశుద్ధి మొదలు పెట్టాలని నిర్వాహకులకు సూచించారు. 40 శాతం రాయితీతో 56 వేల క్వింటాళ్ల విత్తన వేరుశనగ పంపిణీ జూన్‌ మొదటి వారంలోనే ప్రారంభించాల్సి ఉంటుందని, అలాగే రైతులకు ఉచితంగా మినీకిట్ల రూపంలో కందుల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 190 క్వింటాళ్ల జీలుగ, 474 క్వింటాళ్ల జనుము, 95 క్వింటాళ్ల పిల్లిపెసర లాంటి గ్రీన్‌మెన్యూర్‌ సీడ్‌ 50 శాతం సబ్సిడీతో ఇస్తున్నట్లు తెలిపారు.

ఇద్దరు చైన్‌స్నాచర్ల అరెస్ట్‌

తుమకూరు: కర్ణాటకలోని తుమకూరు జిల్లా మధుగిరి పట్టణంలో ఈ నెల 26న చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడిన ఇద్దరిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలను శుక్రవారం వెల్లడించారు. పట్టుబడిన వారిలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రానికి చెందిన రాజు, ఆత్మకూరు మండలం పంపనూరు గ్రామానికి చెందిన ఓబన్న ఉన్నారు. నిందితుల నుంచి 60 గ్రాముల బంగారు చైన్‌ స్వాధీనం చేసుకున్నారు. చిరునామా అడిగే నెపంతో ఈ నెల 26న మధుగిరిలోని దొడ్డపేట దేవాంగ వీధిలో నివాసముంటున్న వృద్ధురాలు లక్ష్మమ్మ మెడలోని 60 గ్రాముల బంగారు గొలుసు లాక్కొని బైక్‌పై ఉడాయించారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు పక్కా ఆధారాలతో అనంతపురంలో ఒకరిని, తెలంగాణలో మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం నిందితులపై శుక్రవారం కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement