అవమాన భారం.. ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

అవమాన భారం.. ఆత్మహత్యాయత్నం

May 30 2026 3:14 AM | Updated on May 30 2026 3:14 AM

పోలీస్‌స్టేషన్‌ ఎదుటే దివ్యాంగుడి కుటుంబం అఘాయిత్యం

అనంతపురం సెంట్రల్‌: మాటలతో కించపరుస్తూ.. భౌతికదాడులకు దిగుతున్న వారిపై చర్యలు తీసుకోకపోవడంతో అవమానభారం భరించలేక దివ్యాంగుడి కుటుంబం పోలీస్‌ స్టేషన్‌ ఎదుటే పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబం తెలిపిన మేరకు... మున్నానగర్‌లో షేక్‌ షాషావలి, ఎస్‌.రేష్మా అనే దివ్యాంగ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి ఇంటి మెట్లకు దగ్గరగా పబ్లిక్‌ ట్యాప్‌ ఉంది. అక్కడ నీళ్లు నిలబడటంతో పాచిపట్టింది. దివ్యాంగులు ఇంట్లోకి వెళ్లే సమయంలో అక్కడ పట్టుతప్పి కిందపడి గాయాలపాలైన ఘటనలు ఉన్నాయి. పబ్లిక్‌ కొళాయిని కాస్త దూరంగా మార్చి తమకు ఇబ్బంది లేకుండా చూడాలని రేష్మా గత నెల 27న నగరపాలక సంస్థ కమిషనర్‌కు అర్జీ ఇచ్చి సమస్యను వివరించింది. అయితే కొళాయిని మరోచోటుకు మార్పు చేయడానికి పొరుగింటి వారు ఒప్పుకోవడం లేదు. దీంతో ఇరు కుటుంబాల నడుమ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తమ శారీరక లోపాన్ని ఎత్తిచూపుతూ దూషణలకు దిగుతున్నారని, వారి వేధింపులతో మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నామని, విచారణ చేసి తమకు న్యాయం చేయాలని షాషావలి ఈ నెల ఏడో తేదీ వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు అండర్‌ సెక్షన్‌ 92 (దివ్యాంగుల చట్టం) కింద మున్నానగర్‌కు చెందిన రామాంజనేయులు, సాదగ్ని, శ్రీదేవి, మున్నీపై కేసు నమోదు చేశారు. అంతకు మించి చర్యలు ముందుకు సాగలేదు. ఈ క్రమంలో గురువారం షాషావలి కుటుంబ సభ్యులపై పొరుగింటి వారు గొడవకు దిగారు. మాటామాటా పెరిగి భౌతికదాడులకు పాల్పడ్డారు. దీన్ని అవమానభారంగా భావించిన షాషావలి కుటుంబ సభ్యులు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి మొరపెట్టుకున్నారు. అయితే రాజకీయ ఒత్తిళ్ల కారణంగా తామేమీ చేయలేమని పోలీసులు చెప్పడంతో స్టేషన్‌ బయటకు వచ్చిన వారు నడిరోడ్డుపై బైఠాయించారు. నిందితులకు అధికార టీడీపీ డివిజన్‌ ముఖ్య నాయకులు అండగా నిలుస్తున్నారని, ఇక న్యాయం జరగనప్పుడు తాము చనిపోవడమే మేలంటూ బాటిల్‌లోని పెట్రోలు ఒంటిపై పోసుకున్నారు. ఇంతలో సీఐ వెంకటేశ్వర్లు వచ్చి వారి ప్రయత్నాన్ని అడ్డుకుని పంపించేశారు. ఇప్పటికై నా స్పందించి న్యాయం చేయకపోతే ఎస్పీని కలుస్తామని బాధితులు తెలిపారు. దివ్యాంగుల గోడును కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement