గుమ్మఘట్ట: ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు ఇన్‌చార్జ్ కలెక్టర్ విష్ణుచరణ్ తెలిపారు. రాయదుర్గం మండలం 74ఉడేగోళం ఆర్టీటీ ఫీల్డ్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు సందర్శనల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, మాట్లాడారు. భూ సమస్యలను పరిష్కరించేందుకు శాయశక్తులా కృషి చేస్తామని పేర్కొన్నారు. కోర్టు వివాదాల్లో ఉన్న భూ సమస్యలకు తీర్పులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, వివిధ సమస్యలపై 25 వినతులు అందినట్లు తహసీల్దార్ హరికుమార్ తెలిపారు. కార్యక్రమంలో కళ్యాణదుర్గం ఆర్డీఓ వసంతబాబు, మండల, గ్రామ స్థాయి అధికారులు పాల్గొన్నారు.
31న కనకదాస ప్రతిభా పురస్కారాల ప్రదానం
అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి, ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కురుబ విద్యార్థులకు ఉమ్మడి జిల్లా కురుబ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 31న ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నారు. ఈ మేరకు సంఘం జిల్లా అధ్యక్షురాలు ఆర్వేటి పద్మావతి, ప్రధాన కార్యదర్శి మంగళకుంట నాగరాజు, కోశాధికారి అట్టే ఓబులేసు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అనంతపురంలోని గుత్తి రోడ్డులో ఉన్న కనకదాస కల్యాణ మంటపంలో జరిగే ఈ కార్యక్రమానికి కురుబ ప్రజాప్రతినిధులు, ఉన్నతస్థాయిలో స్థిరపడిన ఉద్యోగులు హాజరు కానున్నారు.
వనపర్తిలో
గుత్తి వాసి మృతి
గుత్తి: స్థానిక కోట వీధికి చెందిన బొలెరో డ్రైవర్ జగదీష్(24) తెలంగాణలోని వనపర్తి సమీపంలో చోటు చేసుకున్న ప్రమాదంలో మృతి చెందాడు. గురువారం రాత్రి కొత్తిమీర, కరివేపాకు లోడుతో హైదరాబాద్‌కు వెళుతుండగా వనపర్తి సమీపంలో టైర్ పంచర్ కావడంతో వాహనాన్ని రోడ్డు పక్కన ఆపాడు. మరో ఇద్దరితో కలిసి టైర్ మారుస్తున్న సమయంలో వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొనడంతో జగదీష్‌తో పాటు మరో ఇద్దరూ మృతి చెందారు.


