అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి నెలవారీ కోటా మేరకు అన్ని రకాల ఎరువులు కచ్చితంగా సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని కంపెనీ ప్రతినిధులను వ్యవసాయశాఖ జేడీ ఎన్.సాలురెడ్డి ఆదేశించారు. ఎరువుల సరఫరా అంశంపై శుక్రవారం తన చాంబర్‌లో టెక్నికల్ ఏఓ వంశీకృష్ణతో కలిసి ఎరువుల కంపెనీ ప్రతినిధులతో ఆయన సమీక్షించారు. ఈ ఖరీఫ్‌లో సెప్టెంబర్ ఆఖరు వరకు ఒక లక్ష మెట్రిక్ టన్నుల మేర ఎరువులతో ప్రణాళిక ఉన్నందున ఆయా కంపెనీలు తమ టార్గెట్ మేరకు సరఫరా చేయాలన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 48,476 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇందులో యూరియా 10,509 మెట్రిక్ టన్నులు, డీఏపీ 4,630 మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 2,956 మెట్రిక్ టన్నులు, ఎస్‌ఎస్‌పీ 2,175 మెట్రిక్ టన్నులు ఉండగా అత్యధికంగా కాంప్లెక్స్ ఎరువులు 28,205 మెట్రిక్ టన్నులు ఉన్నాయని వివరించారు. త్వరలో కొత్త యాప్ అందుబాటులోకి రానుందని, దీని ద్వారా రైతులే స్వయంగా భూవిస్తీర్ణం, పంటల సాగును బట్టి వారికి అవసరమైన యూరియా, ఇతర ఎరువులను ఇండెంట్ పెట్టుకుని తీసుకునే వెసులుబాటు ఉంటుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆన్‌లైన్‌లో జిల్లా వ్యాప్తంగా దుకాణాలను మ్యాపింగ్ చేస్తున్నామన్నారు. ప్రతి రైతుకూ బయోమెట్రిక్ ద్వారా ఎరువుల అమ్మకాలు పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పంటల వారీగా సాగు విస్తీర్ణంను బట్టి ఆర్‌ఎస్‌కేల్లో తగినంత ఎరువులు ముందస్తుగా నిల్వ చేస్తున్నట్లు తెలిపారు.


