● మున్నార్‌లో మృతి చెందిన ఉపాధ్యాయుడు సుధాకర్‌బాబు
అనంతపురం ఎడ్యుకేషన్: కుటుంబ సభ్యులతో కలిసి కేరళలోని మున్నార్‌కు విహార యాత్రకు వెళ్లిన అనంతపురం రూరల్ మండలం పాపంపేట జెడ్పీహెచ్‌ఎస్ ఇంగ్లిష్ టీచరు సీడీ సుధాకర్ బాబు మృతి చెందారు. అక్కడ కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతుండగా గురువారం రాత్రి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ఆస్పత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించి రాత్రి 11.30 గంటల సమయంలో కన్ను మూశారు. ఆయనకు భార్య నళిని (స్కూల్ అసిస్టెంట్, ఇంగ్లిష్), ఇద్దరు కుమారులున్నారు. ఆయన మృతి తీరని లోటు అని, అంకిత భావంతో పనిచేసే టీచరుగా మన్ననలు పొందారని పాపంపేట జెడ్పీహెచ్‌ఎస్ హెచ్‌ఎం పి.లక్ష్మీదేవి, ఉపాధ్యాయులు వనజ, శోభ, హరికిరణ్, పవన్, వెంకటేష్, కవిత, నాగవేణి సంతాపం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం అయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు.


