రాయదుర్గం: ఓట్ల తొలగింపు, చేర్పులు, మార్పుల విషయంలో బీఎల్‌ఏల పాత్ర కీలకమని, అర్హులైన వారి ఓట్లు ఏ ఒక్కటీ జాబితా నుంచి తొలగిపోకుండా చూడాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. జాతీయ ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో చేపట్టనున్న ఓటరు జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (సర్) ప్రక్రియపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. శుక్రవారం రాయదుర్గంలోని నేషనల్ ఫంక్షన్ హాలులో నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి అధ్యక్షతన ‘సర్’పై వైఎస్సార్‌సీపీ నియోజకవర్గస్థాయి బూత్ లెవెల్ ఏజెంట్ల (బీఎల్‌ఏ)కు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రత్యేక శిక్షకులుగా హాజరైన ‘సర్’ ఇన్‌చార్జ్ గోపీనాథ్, స్టేట్ వింగ్ రీజనల్ సెక్రెటరీలు మంజునాథ, శివారెడ్డితో క్లుప్తంగా ఎల్‌ఈడీ స్క్రీన్ ద్వారా వివరించారు. అనంతరం అనంత వెంకటరామిరెడ్డి, మెట్టు గోవిందరెడ్డి మాట్లాడారు. ఎన్నికల్లో ‘ప్రతి ఓటూ.. భవితకు మెట్టు’ అనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. అధికార తెలుగుదేశం పార్టీ ఓట్ల గోల్‌మాల్‌కు పాల్పడే అవకాశం ఉందని, ఈ విపత్తు నుంచి బయటపడే మార్గం చూసుకోవాలన్నారు. మన ఓటుకు మనమే భద్రతగా ఉండాలన్నారు. ముఖ్యంగా 2002– 2025 మధ్య ఓట్ల వ్యత్యాసాన్ని ప్రతి బూత్‌లోనూ సరిచూసుకోవాలన్నారు. ఇటీవల పశ్చిమబెంగల్‌లో సర్ ప్రోగ్రాం ద్వారా 90 లక్షల ఓట్లు తొలగించారని గుర్తు చేశారు. సీఎం అభ్యర్థి మమత బెనర్జీ నియోజకవర్గంలోనూ 48 వేల ఓట్లు తొలగిస్తే .. ఆమె 15 వేల ఓట్లతో మాత్రమే ఓటమి పాలయ్యారన్నారు. తమిళనాడులోనూ 78 లక్షల ఓట్లు కోత కోశారన్నారు. ఇలా ఈ రెండు చోట్లే కాదు మొన్న జరిగిన ఐదు రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఘటనలే వెలుగుచూశాయన్నారు. జూన్ 15 నుంచి ‘సర్’ ప్రక్రియ ప్రారంభం కాగానే బీఎల్‌ఏలు అధికారుల వెంటే ఉండాలన్నారు. కారణం లేకుండా ఒక్క ఓటు తొలగించినా ఉపేక్షించేది లేదన్నారు. మోసం, కుట్ర, దగా చేయడం సీఎం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యలన్నారు.
‘స్థానిక’ ఎన్నికల్లో సత్తా చాటుదాం
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ సత్తా చాటాలని అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి పిలుపునిచ్చారు. రెండు రోజుల క్రితం వైఎస్సార్‌సీపీ అధినేత ఈ విషయంపై దిశానిర్దేశం చేశారని, దీనికి ప్రతి కార్యకర్తా కట్టుబడి పనిచేయాలన్నారు. ప్రజల్లో చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందన్నారు. రెండేళ్లు గడిచినా సూసర్ సిక్స్‌లోని ప్రధాన హామీలన్నీ అటకెక్కించారన్నారు. అభివృద్ధిని విస్మరిస్తూ దోపిడికే పెద్దపీట వేస్తున్నారని మండిపడ్డారు. భవిష్యత్తు వైఎస్సార్‌సీపీదే నని, ప్రజలంతా జగన్‌ను మళ్లీ సీఎంగా చూడాలని కోరుకుంటున్నారన్నారు. ‘సర్’ కార్యక్రమంపై మండలాల్లోనూ నాయకులు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎస్‌ఈసీ మెంబర్ గౌని ఉపేంద్రారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కళేకుర్తి ఉషారాణి, పొరాళ్ల శివకుమార్, సుదర్శనరెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, బీటీపీ గోవిందు, రాజ్‌కుమార్, నాయక్, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ పొరాళ్ల శిల్ప, పార్టీ పట్టణ, మండల కన్వీనర్లు మేకల శ్రీనివాసులు, గౌని కాంతారెడ్డి, రామాంజినేయులు, బ్రహ్మానందరెడ్డి, వాల్మీకి రామాంజినేయులు, రవీంద్రనాథ్‌రెడ్డి, మైనార్టీ నాయకుడు రహంతుల్లా, బూత్‌లెవెల్ అధ్యక్షుడు అంజిరెడ్డి, కేపీదొడ్డి రమేష్, ఆర్‌టీ కాంతారెడ్డి, ఎంపీపీ భవాని, బీఎల్‌ఏలు తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, చిత్రంలో మెట్టు గోవిందరెడ్డి, హాజరైన బీఎల్‌ఏలు, పార్టీ నాయకులు
ఇటీవల ఐదు రాష్ట్రాల్లో భారీగా ఓట్లు తొలగించారు
ఇక్కడ ఆ పరిస్థితి రాకూడదు
ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లకుండా జాగ్రత్త పడాలి
బీఎల్‌ఏలకు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత సూచన


