అనంతపురం ఎడ్యుకేషన్: రాష్ట్రంలో పాలన సాగిస్తోంది కూటమి ప్రభుత్వం కాదని, కుట్రల ప్రభుత్వం అని వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన ‘మెగా డీఎస్సీ’ పూర్తిగా అవ్యవస్థలు, అనుమానాలకు కేంద్రబిందువుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌యాదవ్ ఆధ్వర్యంలో నగరంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. మెడకు ఉరితాళ్లు బిగించుకుని వినూత్న నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు నరేంద్రరెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ పరీక్షల నిర్వహణలో జరిగిన గందరగోళంతో అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారన్నారు. అభ్యర్థుల నుంచి వస్తున్న ఆరోపణలు, ప్రశ్నపత్రాల లీకేజీ అనుమానాలు, టెక్నికల్ సమస్యలు అన్నింటిపైనా సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉంటే ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గందరగోళాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్‌ను బర్తఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయన రాజకీయాలతో విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. సమాధానం చెప్పాల్సిన మంత్రి బెదిరింపులు, ఒత్తిళ్లు, రాజకీయ ప్రతీకారాలతో ముందుకు వెళ్తున్నారన్నారు. మెగా డీఎస్సీ నిర్వహణలో అక్రమాలపై సమగ్ర వివరణ ఇవ్వాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నవీన్‌రెడ్డి, విజయ్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కాశీరాం నాయక్, రాష్ట్ర నాయకులు సుధీర్‌రెడ్డి, షెక్షావలి, జిల్లా ఉపాధ్యక్షులు వెంకట్ రాయల్, మంజునాథ్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు నిషాంత్‌రెడ్డి, అశోక్, గంగ శివుడు, సాయి నితిన్, నాగరాజు గౌడ్, నగర అధ్యక్షులు కై లాష్, రేవంత్ రెడ్డి, అజయ్, కాశీ మనోజ్, సాకే పురుషోత్తం, నగర ఉపాధ్యక్షులు అంజన్‌రెడ్డి, శివ దత్తాత్రేయ, నగర ప్రధాన కార్యదర్శులు పులి కార్తికేయ, రాహుల్ రెడ్డి, మనోజ్, హరీష్, చరణ్, ప్రకాష్, సాయిరెడ్డి, షరీఫ్, గన, నవీన్, దినేష్, రియాజ్, సుబ్బు, తరుణ్, లోకేష్, సురేంద్ర, ప్రసాద్, అరుణ్, రఫీ, కార్తీక్ పాల్గొన్నారు.
డీఎస్సీ–25 నిర్వహణపై సీబీఐ విచారణ చేయించాలి
అంబేడ్కర్ విగ్రహం వద్ద ఉరితాళ్లతో విద్యార్ధి నాయకుల నిరసన
నారా లోకేష్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్


