గాలి మరకు మంటలు | - | Sakshi
Sakshi News home page

గాలి మరకు మంటలు

May 30 2026 12:29 AM | Updated on May 30 2026 12:29 AM

ఆత్మకూరు: ఆత్మకూరు వద్ద ముట్టాల రోడ్డుకు వెళ్లే దారి పక్కన శుక్రవారం తెల్లవారుజామున గాలి మరకు మంటలు అంటుకున్నాయి. మధ్యాహ్నం వరకు గాలి మర పైన మంటలు చెలరేగాయి. టెక్నికల్‌ సమస్యల వల్ల అలా మంటలు వ్యాపించి ఉండవచ్చని నిర్వాహకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫైర్‌ ఇంజిన్‌ వచ్చి మంటలు అదుపు చేసే ప్రయత్నం చేసింది. మధ్యాహ్నానికి మంటలు అదుపులోకి వచ్చి పూర్తిగా ఆగిపోయాయి.

జూనియర్‌ కళాశాలలకు 5 వరకు సెలవులు

అనంతపురం ఎడ్యుకేషన్‌: అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల నేపథ్యంలో జూన్‌ 1న పున:ప్రారంభం కావాల్సిన జూనియర్‌ కళాశాలలు ఆరో తేదీకి మార్పు చేశారు. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అకడమిక్‌ కేలండర్‌ మేరకు ఒకటో తేదీ కళాశాలలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఐదో తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు కొనసాగనున్నాయి. చాలా కళాశాలలు పరీక్ష కేంద్రాలుగా ఉపయోగిస్తున్నారు. దీనికితోడు అధ్యాపకులు, సిబ్బంది పరీక్షల విధుల్లో ఉన్నారు. పరీక్షల నిర్వహణ పూర్తయ్యేదాకా సాధారణ తరగతులు ప్రారంభించడం కష్టమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు మరో 5 రోజుల అదనపు సెలవులు లభించాయి. అకడమిక్‌ క్యాలెండర్‌లోని మిగతా షెడ్యూళ్లు, సూచనలు యథాతథంగానే కొనసాగుతాయని బోర్డు కార్యదర్శి స్పష్టం చేశారు.

జిల్లాకు ‘ఎల్లో’ అలర్ట్‌

ఈదురుగాలులు, తేలికపాటి వర్షసూచన

అనంతపురం అగ్రికల్చర్‌: రాగల నాలుగు రోజలు ఉమ్మడి అనంతపురం జిల్లాకు ‘ఎల్లో’ అలర్ట్‌ ప్రకటించినట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ ఎం.విజయశంకరబాబు, సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ జి.నారాయణస్వామి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖ వాతావరణ కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు ఈ నెల 30 నుంచి జూన్‌ 2 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షంతో పాటు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. 30న 9 మి.మీ, 31న 4.3 మి.మీ, జూన్‌ ఒకటిన 6 మి.మీ, 2న 4 మి.మీ సగటు వర్షపాతం నమోదు కావచ్చని తెలిపారు. ఉరుములు, మెరుపుల సమయంలో పిడుగుపాటుకు గురికాకుండా అలాగే ఈదురుగాలులకు పంటలు దెబ్బతినకుండా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

పీజీ సెట్‌ ఫలితాల విడుదల

అనంతపురం: యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ పీజీ సెట్‌ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 1338 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1154 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 1040 (90.12 శాతం) మంది అర్హత సాధించారు. ఎలక్ట్రానిక్స్‌ విభాగంలో అనంతపురం జిల్లాకు చెందిన కె.భార్గవి రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించారు. జనరల్‌ విభాగంలో వడ్డే అనిల్‌ కుమార్‌ రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించారు. సెరికల్చర్‌ విభాగంలో ఎస్‌. హర్షవర్ధిని రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు, శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన టి.మదీనా తస్లీం సెరికల్చర్‌ విభాగంలో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు తెచ్చుకున్నారు. మొత్తం 30 బ్రాంచ్‌ల్లో అడ్మిషన్లు నిర్వహించడానికి ఏపీ పీజీసెట్‌ నిర్వహించారు. దీంతో ఈ దఫా కూడా పీజీ కళాశాలలు తగినన్ని సీట్లు భర్తీకాక వెలవెలబోయే పరిస్థితి నెలకొంది.

ఆలింగనం చేసుకుని సెల్‌ఫోన్‌ కొట్టేశాడు

గుత్తి: బక్రీద్‌ సందర్భంగా గుత్తిలో జేబు దొంగలు చెలరేగిపోయారు. సామూహిక ప్రార్థనల అనంతరం ఈద్గా మైదానం నుంచి బయటకు వస్తున్న స్థానికుడు మహమ్మద్‌ రఫీని ఓ అపరిచిత వ్యక్తి కలిసి ఈద్‌ ముబారక్‌ అంటూ ఆలింగనం చేసుకున్నాడు. పరిచయం లేని వ్యక్తి తనకు ఈద్‌ ముబారక్‌ చెప్పడంతో మహమ్మద్‌ రఫీ సైతం మురిసిపోతూ ఆలింగనం చేసుకున్నాడు. కాసేపటి తర్వాత చూసుకుంటే తన జేబులో ఉండాల్సిన రూ.15 వేలు విలువ చేసే సెల్‌ఫోన్‌ కనిపించలేదు. తనను ఆలింగనం చేసుకున్న వ్యక్తే మొబైల్‌ను అపహరించి ఉంటాడని గ్రహించిన బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement