● ‘పరిటాల’ అనుచరుడు రవి దందా
● అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిన పోలీసులు
సాక్షి, టాస్క్‌ఫోర్స్: పరిటాల అనుచరుడిగా చెప్పుకుంటూ విలేకరి ముసుగులో వసూళ్లకు పాల్పడుతున్న ఓ యూట్యూబ్ చానల్ నిర్వాహకుడిని నంద్యాల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే...రామగిరి మండలం పీఆర్ కొట్టాలకు చెందిన వై.రవి తాను ప్రజాటీవీ చానల్ స్టాఫ్ రిపోర్టర్‌నని చెప్పుకుంటూ పలువురిని బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడేవాడు. ఈ క్రమంలోనే నంద్యాలలోని ఉదయానంద ఆస్పత్రిలోని గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ భార్గవరెడ్డిని కలిసి తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే తప్పుడు కథనాలు ప్రసారం చేస్తానని బెదిరించాడు. దీంతో వైద్యుడు గతంలో రూ.4 వేలు ఇచ్చి పంపించాడు. రెండు రోజుల క్రితం మళ్లీ డబ్బుల కోసం ఫోన్ చేసి బెదిరింపులకు దిగాడు. అయితే డాక్టర్ లెక్కచేయకపోవడంతో గురువారం రాత్రి నేరుగా నంద్యాలలోని ఆస్పత్రికి వెళ్లి రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇందుకు డాక్టర్ తిరస్కరించడంతో హంగామా చేశాడు. ఆస్పత్రి సిబ్బంది నుంచి సమాచారం అందుకున్న నంద్యాల త్రీటౌన్ పోలీసులు వచ్చి రవిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతనిపై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేశారు. శుక్రవారం కోర్టులో ప్రవేశపెట్టి.. జడ్జి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వేణుగోపాల్ తెలిపారు.
రవి చరిత్ర అంతా నేరమయం
రవి చరిత్ర అంతా నేరమయమేనని పీఆర్ కొట్టాల గ్రామస్తులు తెలిపారు. చేతికి ‘పరిటాల రవి’ అని పచ్చబొట్టు వేయించుకుని ఆ కుటుంబానికి తాను ముఖ్య అనుచరుడినంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ డబ్బులు వసూలు చేసేవాడన్నారు. తరువాత కులసంఘాల పేరుతో దందాలు కొనసాగించాడన్నారు. ప్రస్తుతం ప్రజాటీవీ విలేకరినని వ్యాపారులను, ఇతరులను బెదిరిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడన్నారు. అంతేకాకుండా అనంతపురం నుంచి విజయవాడకు ద్విచక్ర వాహనంలో వెళ్తూ మార్గమధ్యంలోని ప్రముఖులను బెదిరించేవాడని స్థానికులు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే రవిపై అనంతపురం వన్‌టౌన్, టూటౌన్, త్రీటౌన్ పోలీస్‌స్టేషన్లలో కేసులు కూడా నమోదైనట్లు పీఆర్ కొట్టాల వాసులు తెలిపారు. తాజాగా నంద్యాలలోనూ వైద్యుడిని బెదిరించి కటకటాల పాలయ్యాడని వెల్లడించారు.


