టీబీ డ్యాంలో 10 టీఎంసీల నీరు | - | Sakshi
Sakshi News home page

టీబీ డ్యాంలో 10 టీఎంసీల నీరు

May 29 2026 2:07 AM | Updated on May 29 2026 2:07 AM

బొమ్మనహాళ్‌: ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి రిజర్వాయర్‌, అనంతపురం జిల్లా ప్రజల వర ప్రదాయిని తుంగభద్ర జలాశయం (టీబీ డ్యాం)లో 10.140 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 2025 డిసెంబర్‌ 27న నిలిచిపోయిన ఇన్‌ఫ్లో డ్యాం ఎగువ ప్రాంతాల్లో ఈ నెల 19 నుంచి కురుస్తున్న వర్షాలతో మళ్లీ ప్రారంభమైంది. ఆశించిన రీతిలో వర్షాలు కురిస్తే జూన్‌ లేదా జూలైలో పూర్తి స్థాయిలో నీరు చేరుతుంది. డ్యాం నీటి మట్టం 1,633 అడుగులతో 105.788 టీఎంసీల నిల్వ సామర్థ్యం కాగా.. గురువారానికి 1,588.91 అడుగులతో 10.140 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 623 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 54 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. గత ఏడాది ఇదే సమయానికి 1,590.76 అడుగుల వద్ద 11.680 టీఎంసీల నీరు నిల్వ ఉండి 2,574 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 131 క్యూసెక్కుల అవుట్‌ ఫ్లో ఉండింది.

అదిరిందయ్యా చంద్రం!

అనంతపురం: నాయకుల ప్రసంగాలు విసుగు పుట్టించాయి. ఊకదంపుడు ఉపన్యాసాలు వినలేక ‘తెలుగు తమ్ముళ్లు’ సరదాగా చిందేశారు. పూటుగా మద్యం తాగి.. రోడ్డుపై ఎక్కడపడితే అక్కడే తాగి ఊగిపోయారు. మత్తులో తూలి పడిపోయి అచేతనావస్థలో ఉండిపోయారు. గురువారం అనంతపురం సప్తగిరి సర్కిల్‌లోని మూడు రోడ్ల కూడలిలో ఓ టీడీపీ కార్యకర్త పూటుగా మద్యం సేవించి రోడ్డుపైనే పడిపోయిన దృశ్యమిది. అనంతపురంలో ఏర్పాటు చేసిన మహానాడు వేదికలో పార్టీ నేతలు ప్రసంగాలు చేస్తుండగా, అక్కడ నుంచి కొందరు బయటకు వచ్చేసి మద్యం సేవించడానికి పోటీపడడం గమనార్హం. ఈ క్రమంలో మద్యం మత్తులో తూలుతున్న టీడీపీ నాయకులు, కార్యకర్తల ఫొటోలు, వీడియోలను తీసిన పలువురు ‘అదిరిందయ్యా చంద్రం’ అంటూ సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా విపరీతంగా వైరలయ్యాయి.

బెట్టింగ్‌రాయుళ్ల అరెస్ట్‌

కుందుర్పి: మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో బుధవారం రాత్రి క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడిన పలువురిని అరెస్ట్‌ చేసినట్లు ఎస్‌ఐ మహేష్‌ తెలిపారు. పట్టుబడిన ఐదుగురూ 18 నుంచి 19 సంవత్సరాల్లోపు వయసున్న వారే కావడం గమనార్హం. వివరాలను గురువారం ఆయన వెల్లడించారు. బెట్టింగ్‌రాయుళ్లను అరెస్ట్‌ చేసి, వారి నుంచి రూ.20,100 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement