క్లుప్తంగా
గార్లదిన్నె: మండలంలోని జంబులదిన్నె చెరువు సమీపంలో ముళ్లకంపల్లో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఓ గుర్తు తెలియని వృద్ధురాలి మృతదేహాన్ని గురువారం స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి అశ్విణ్ మణిదీప్, డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ కౌలుట్లయ్య అక్కడకు చేరుకుని పరిశీలించారు. సుమారు 60 నుంచి 65 ఏళ్ల మధ్య వయస్సు ఉంటుందని, మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తుతెలియని శవంగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు. 20 రోజుల క్రితం చనిపోయి ఉండవచ్చునని ప్రాథమికంగా అంచనా వేశారు. అక్కడే పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని ఖననం చేశారు. మిస్సింగ్ కేసులో సంబంధీకులు ఎవరైనా ఉంటే గార్లదిన్నె పోలీసులను సంప్రదించాలని కోరారు.
నగరంలో ఇద్దరి బలవన్మరణం
అనంతపురం సెంట్రల్: జిల్లా కేంద్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు... నగరంలోని నవోదయకాలనీలో నివాసముంటున్న గుజ్జల నాగార్జున భార్య గాయత్రి (35) కుటుంబ కలహాల నేపథ్యంలో గురువారం విషపూరిత ద్రావకం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఇందిరానగర్‌లో నివాసముంటున్న కొలిమి మహమ్మద్ రఫి(36) గురువారం వేకువజామున ఉరి వేసుకున్నాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, రఫీ ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
‘దుర్గం’లో పోలీసుల దందా!
కళ్యాణదుర్గం రూరల్: స్థానిక అర్బన్ పోలీసులు తీరు వివాదాస్పదమవుతోంది. నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్న యువకులను విచారణ పేరుతో స్టేషన్‌కు పిలుచుకెళ్లి అందిన కాడికి డబ్బు వసూలు చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గురువారం బక్రీద్ సందర్భంగా కొందరు యువకులు పట్టణ సమీపంలో మద్యం సేవిస్తుండగా పోలీసులు అక్కడకు చేరుకుని, వారి సెల్‌ఫోన్లను లాక్కొన్నారు. అనంతరం విచారణ పేరుతో స్టేషన్‌కు తీసుకెళ్లి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకూ ఒక్కొక్కరి ద్వారా వసూలు చేసుకుని వదిలేశారు. అయితే ఈ ఆరోపణలపై పోలీసులను వివరణ కోరగా స్పందించలేదు.
కేబుల్ కత్తిరిస్తూ
పట్టుబడిన దొంగ
డి.హీరేహాళ్(బొమ్మనహాళ్): వ్యవసాయ బోరుబావి వద్ద కేబుల్ కత్తిరిస్తూ రైతులకు ఓ దొంగ పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే.. డి.హీరేహాళ్ మండలం మురడి గ్రామ శివారున ఉన్న రైతు పొలంలో బోరు బావి వద్ద బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఓ వ్యక్తి కేబుల్ కత్తిరిస్తుండగా రైతులు గుర్తించి, వెంటనే బంధించారు. విచారణలో బళ్లారి జిల్లా సంగనకల్లు గ్రామానికి చెందిన వెంకటేష్‌గా గుర్తించారు. రైతుల నుంచి సమాచారం అందుకున్న డి.హీరేహాళ్ ఎస్‌ఐ గురుప్రసాదరెడ్డి అక్కడకు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం గురువారం కేసు నమోదు చేశారు.
గుప్త నిధుల వేటగాళ్ల అరెస్ట్
తలుపుల: గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న ఓ ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు రూరల్ సీఐ నాగేంద్ర, ఎస్‌ఐ చెన్నయ్య తెలిపారు. గురువారం వివరాలను ఆయన వెల్లడించారు. తలుపుల మండలం పులిగుండ్లపల్లి సమీపంలోని పెద్దపులి కొండ ప్రాంతంలో కొందరు వ్యక్తులు బుధవారం రాత్రి గుప్త నిధుల కోసం తవ్వకాలు సాగిస్తుండగా స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆ సమయంలో రాజనాలవాండ్లపల్లికి చెందిన గంగాద్రి పారిపోగా, ముఠా సభ్యుల్లో ఎనిమిది మంది పట్టుబడ్డారన్నారు. వీరి నుంచి పోలీసులు రెండు కార్లు, పార, గునపం, రెండు గోలాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు వివరించారు. గంగాద్రి కోసం విస్తృత గాలింపు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.
గంగమ్మ ఆలయంలో వెండి కిరీటం చోరీ
ఓడీచెరువు: నారప్పగారిపల్లిలో గంగమ్మ ఆలయంలో వెండి కిరీటం చోరీ అయినట్లు గ్రామస్తులు గురువారం తెలిపారు. నారప్పగారిపల్లిలోని గంగమ్మ ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు అమ్మవారి వెండి కిరీటాన్ని చోరీ చేశారని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ మల్లికార్జున రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


