డీఎస్సీ అక్రమాలపై నేడు నిరసన | - | Sakshi
Sakshi News home page

డీఎస్సీ అక్రమాలపై నేడు నిరసన

May 29 2026 2:07 AM | Updated on May 29 2026 2:07 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: డీఎస్సీ–2025 నియామకాల్లో చోటు చేసుకున్న అక్రమాలు, అవకతవకలు, స్పోర్ట్స్‌ కోటా పోస్టుల భర్తీపై సీబీఐ విచారణ చేపట్టాలనే డిమాండ్‌తో శుక్రవారం వైఎస్సార్‌ఎస్‌యూ ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలియజేయనున్నారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ విద్యార్ధి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌ యాదవ్‌ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. నిరుద్యోగ యువత భవిష్యత్తుతో చంద్రబాబు ప్రభుత్వం ఆటలాడుతోందని విమర్శించారు. మెరిట్‌ జాబితాలో ఉన్న అభ్యర్థుల పేర్లు తుది ఎంపికలో లేకపోవడం, ప్రశ్న పత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. స్పోర్ట్స్‌ కోటాలో 421 పోస్టుల విక్రయాల ఆరోపణలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నిరసన కార్యక్రమానికి నిరుద్యోగ యువత, డీఎస్సీ అభ్యర్థులు, విద్యార్థులు, విద్యార్ధి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

దర్గా కట్ట వద్ద

యువకుడి మృతి

యాడికి: మండల కేంద్రంలోని దర్గా కట్టపై కూర్చొన్న ఓ యువకుడు ఉన్నఫళంగా కిందపడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం గొర్విమానుపల్లికి చెందిన మద్దిలేటి కుమారుడు సుధాకర్‌(34)కు యాడికి మండలం కమలపాడుకు చెందిన యువతితో వివాహమైంది. ఈ క్రమంలో కమలపాడుకు వచ్చిన సుధాకర్‌ గురువారం యాడికి గ్రామానికి వచ్చాడు. సాయంత్రం కమలపాడు మార్గంలోని దర్గా వద్దకు చేరుకుని కట్టపై కూర్చొన్న అతను ఉన్నఫళంగా కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడు చేరుకుని పరిశీలించారు. మృతుడి తండ్రి మద్దిలేటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, సుధాకర్‌ మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.

రైలు ఢీకొని వృద్ధురాలికి

తీవ్ర గాయాలు

రాయదుర్గం టౌన్‌: రైలు ఢీకొన్న ఘటనలో స్థానిక సీబీఎన్‌ కాలనీకి చెందిన శంకరమ్మ(70) తీవ్రంగా గాయపడింది. కాలనీకి ఆనుకుని ఉన్న రైలు పట్టాలపై పావగడ రైల్వేస్టేషన్‌ నుంచి రెండు బోగీలు ఉన్న తనిఖీ రైలు గురువారం సాయంత్రం రాయదుర్గం స్టేషన్‌కు చేరుకుంటుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో బహిర్భూమి కోసం పట్టాలు దాటుతున్న శంకరమ్మను రైలు ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. తల, కాలుకు తీవ్ర రక్తగాయాలైన శంకరమ్మను 108లో స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అనంతపురానికి వైద్యులు రెఫర్‌ చేశారు.

పేకాటరాయుళ్ల అరెస్ట్‌

అనంతపురం సెంట్రల్‌: నగరంలోని అశోక్‌నగర్‌ హరిహరదేవాలయం సమీపంలో బహిరంగ ప్రదేశంలో పేకాట ఆడుతూ 10 మంది పట్టుబడ్డారని వన్‌టౌన్‌ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. అందిన సమాచారం మేరకు గురువారం తనిఖీలు చేపట్టిన సమయంలో జూదరులు పట్టుబడ్డారన్నారు. వీరి నుంచి రూ.10,600 స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు వివరించారు.

బాలిక ఆత్మహత్య

ఎన్‌పీకుంట: తల్లి మందలింపుతో మనస్థాపం చెంది ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... ఎన్‌పీకుంట మండలం కటకంవారిపల్లికి చెందిన వల్లెపు నవ్య (14) ఇంటి పనులు సరిగా చేయకపోవడంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన బాలిక గురువారం తెల్లవారుజామున బాత్రూమ్‌లో పైకప్పునకు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ కృష్ణమూర్తి క్షేత్రస్థాయిలో పరిశీలించి, కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement