అనంతపురం: ముస్లింలందరికీ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. పేదల పట్ల దయ, జాలి కలిగి ఉండడమే ఈ పండుగ ఇచ్చే సందేశమని పేర్కొన్నారు. ఖుర్బానీ ఇచ్చే ముస్లింలకు ఎంతో పుణ్యఫలం లభిస్తుందని పేర్కొన్నారు. దైవ పరీక్షలో కన్నకొడుకు ప్రాణాలను బలిచ్చేందుకు సిద్ధపడిన మహనీయుని త్యాగానికి గుర్తుగా బక్రీద్ పర్వదినాన్ని జరుపుకుంటారని తెలిపారు. ముస్లింలందరిపై అల్లాహ్ ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.
రీసర్వే పనులను
వేగవంతం చేయండి
శింగనమల(నార్పల): రీసర్వే పనులను వేగవంతం చేయాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ విష్ణు చరణ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం నార్పల మండలం చాములూరులో రీసర్వే పనులను ఆయన తనిఖీ చేశారు. అనంతరం ఇన్‌చార్జ్ కలెక్టర్ రైతులతో మాట్లాడారు. రైతులకు అవగాహన కల్పిస్తూ ఇబ్బందులు లేకుండా రీసర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేశారు. బీఎల్‌ఓలతో మాట్లాడారు. మొబైల్ ఆప్లికేషన్‌లో ఫ్యామిలీ మ్యాపింగ్ ఎంత శాతం పూర్తయ్యిందో పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీధర్‌మూర్తి, మండల సర్వేయర్ బ్రహ్మానందం, సచివాలయ సిబ్బంది ఉన్నారు.
డ్రైల్యాండ్ హార్టికల్చర్
పనులకు గ్రీన్ సిగ్నల్
అనంతపురం టౌన్: మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో డ్రైల్యాండ్ హార్టికల్చర్ కింద పండ్ల తోటల పెంపకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని జిల్లా నీటియాజమాన్య సంస్థ (డ్వామా) ప్రాజెక్టు డైరెక్టర్ సలీంబాషా తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా 2026–27ఆర్ధిక సంవత్సరంలో 16 రకాల పండ్లతోటలు, రెండు రకాల పూల తోటలతోపాటు మునగ సాగుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 7,500ఎకరాల్లో పండ్ల మొక్కల పెంపకాన్ని చేపట్టాలనే లక్ష్యం నిర్దేశించినట్లు తెలిపారు. ఐదు ఎకరాల్లోపు మెట్టభూములన్న రైతులు పండ్ల మొక్కల పెంపకానికి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఆసక్తి గల రైతులు గ్రామాల్లోని ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏపీఓలను సంప్రదించాలని సూచించారు.
జూన్ 1 నుంచి
‘వీబీ జీ రామ్ జీ’ అమలు
అనంతపురం టౌన్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్) స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వీబీ జీ రామ్ జీ (వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్) చట్టాన్ని జూన్ 1 నుంచి అమలు చేయనున్నట్లు జిల్లా నీటియాజమాన్య సంస్థ (డ్వామా) ప్రాజెక్ట్ డైరెక్టర్ (పీడీ) సలీంబాషా తెలిపారు. వీబీ జీ రామ్ జీ చట్టం కింద కూలీలకు ఏడాదిలో 125 పని దినాలు కల్పించడంతోపాటు రోజువారి వేతనాన్ని రూ.311 చెల్లించనున్నారు. 2026–27ఆర్థిక సంవత్సరంలో రూ.117.64కోట్ల మేర నిధులను అనంతపురం జిల్లాకు కేటాయించారు. ఇందులో కూలీల వేతనాలకు రూ.70.54కోట్లు, మిగిలిన మొత్తం వివిధ రకాల మెటీరియల్ కోసం వెచ్చించనున్నారు. కూలీల వేతనాల సొమ్ము సైతం 15 రోజుల్లో ఖాతాల్లో జమ చేయనున్నారు. పనులు కావాలని అడిగిన 15రోజుల్లోపు స్థానికంగానే పనులు కల్పించనున్నారు. పనులు కల్పించకపోతే భృతి అందించనున్నారు. నూతన చట్టంలో ఉపాధి అక్రమాలను ఆరికట్టేందుకు కేంద్రం నూతన సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
అనంత వెంకటరామిరెడ్డి


