తాడిపత్రిటౌన్: సరదాగా మొదలై ఆరోగ్యాన్ని దెబ్బతీసి జీవితాన్ని అంధకారంలోకి నెట్టే గంజాయికి తాడిపత్రి ప్రాంతం అడ్డాగా మారింది. నెల వ్యవధిలో రెండు చోట్ల గంజాయి పట్టుబడటంతో పాటు నివాసాల మధ్య గంజాయి మొక్కలు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. పైగా పలు వార్డుల్లో యువకులు గంజాయి బ్యాచ్‌లుగా మారి అర్ధరాత్రి వేళ అలజడి సృష్టిస్తున్నారు. అయితే గంజాయి గ్యాంగ్‌లు పట్టుబడిన ప్రతిసారీ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అనుమానాలకు తావిస్తోంది. గంజాయి గూండాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వాస్తవాల వక్రీకరణ ఎందుకో..?
తాడిపత్రి రైల్వే స్టేషన్ ప్రాంతంలో గత నెల 29న నిర్వహించిన తనిఖీల్లో ఒడిశాకు చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి దాదాపు పది కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. అయితే ప్రజలు మరోలా అంటున్నారు. తాడిపత్రిలోని గంజాయి ముఠాలకు విక్రయించేందుకు వచ్చిన ఒడిశా వాసులు లాడ్జీలో బస చేయడంతో వారిని పోలీసులు పట్టుకున్నారని, అయితే ముఠాలు లేదా లాడ్జీ యజమానిని రక్షించడం కోసమో పోలీసులు వాస్తవాన్ని వక్రీకరణ చేస్తున్నారని చర్చించుకుంటున్నారు. ఈ నెల 24న పట్టణానికి చెందిన గోర హాజీ, సాయిలు దాదాపు ఒకటిన్నర కేజీ గంజాయితో నందలపాడు వద్ద ఉన్న రైల్వే బ్రిడ్జ్ వద్ద ఉండగా పోలీసులు పట్టుకున్నారు.
గంజాయి మొక్కల కలకలం
పట్టణంలోని టైలర్స్ కాలనీ, పాతకోట కాలనీల్లో ఏపుగా పెరిగిన గంజాయి మొక్కలు గతంలో కలకలం రేపాయి. పట్టణ శివారులోని పలు దుకాణాల్లో గంజాయి అమ్ముతున్నారు. పరిచయం ఉన్న వ్యక్తులకే గంజాయిని విక్రయిస్తున్నట్లు సమాచారం. గంజాయి బ్యాచ్‌లతో పట్టణ ప్రజలు భయం భయంగా గడపాల్సిన పరిస్థితి.
గంజాయి బ్యాచ్‌ల హల్‌చల్
చీకటి పడితే చాలు పట్టణంలోని యల్లనూరు రోడ్డు, టైలర్స్ కాలనీ, పాతకోట, క్రిష్ణాపురంతో పాటు పలు శివారు కాలనీల్లో గంజాయి గ్యాంగ్‌లు హల్‌చల్ చేస్తున్నాయి. ద్విచక్రవాహనాలపై మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ.. ప్రశ్నించిన కాలనీవాసులపై దాడులకు తెగబడుతున్నాయి. కొంత మంది అధికారపార్టీ నాయకులు యువకులను గంజాయికి అలవాటు చేసి వారి వెంట తిప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. సదరు నాయకుల చేష్టలను ప్రశ్నించినా.. వ్యతిరేకంగా మాట్లాడినా గంజాయి గ్యాంగ్‌లను అర్థరాత్రి పూట దాడులకు ఉసిగొల్పుతున్నారు. తాడిపత్రిలో ఐపీఎస్ స్థాయి అధికారి ఉన్నా.. గంజాయి గ్యాంగ్‌ల ఏరివేతలో కిందిస్థాయి అధికారులు తప్పుదారి పట్టిస్తున్నట్లు తెలుస్తోంది.
నెల రోజుల్లో రెండు చోట్ల గంజాయి పట్టివేత
పలు కాలనీల్లో మొక్కలు ప్రత్యక్షం
పోలీసుల తీరుపై అనుమానాలు


