గంజాయి ముఠా అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

గంజాయి ముఠా అరెస్ట్‌

May 28 2026 1:28 AM | Updated on May 28 2026 1:28 AM

7 కిలోల గంజాయి స్వాధీనం

అనంతపురం సెంట్రల్‌: అనంతపురం నగరంలో గంజాయి విక్రయిస్తున్న 14 మంది ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి ఏడు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. బుధవారం అనంతపురంలోని పోలీసు కాన్ఫరెన్స్‌ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ జగదీష్‌ వివరాలు వెల్లడించారు. నగరంలోని ఎన్‌టీఆర్‌ కాలనీకి చెందిన షికారి సురేష్‌, షికారి మల్లప్ప, షికారి భరత్‌, షికారి పరుశురాం, షికారి రవి, షికారి అర్జున్‌, షికారి అశోక్‌, షికారి జంపా, బుడ్డప్పనగర్‌కు చెందిన షికారి రాము, షికారి ఉజ్జులు, షికారి భగవాన్‌, షికారి జయమ్మ, షికారి సునందన, వెంగమనాయుడు కాలనీకి చెందిన షికారి రాజమ్మలను అరెస్ట్‌ చేశారు. ఇందులో షికారి సురేష్‌ కీలక నిందితుడు. గతంలో అనంతపురం వన్‌టౌన్‌, టూటౌన్‌, నాల్గవ పట్టణం, రాప్తాడు పోలీసు స్టేషన్లలో ఐదు దొంగతనాలు, ఎకై ్సజ్‌, గంజాయి కేసులు ఉన్నాయి. గుంతకల్లు రైల్వే స్టేషన్‌ కేంద్రంగా గంజాయి నెట్‌వర్క్‌ నడుపుతున్నాడు. గుర్తు తెలియని వ్యక్తి ద్వారా కిలో గంజాయి రూ.10 వేలు చొప్పున కొనుగోలు చేసి.. పాత నేరస్తుల సాయంతో నగరానికి తీసుకొస్తున్నాడు. ముఠాలోని మిగిలిన నిందితుల ద్వారా గంజాయిని చిన్న చిన్న పొట్లాలుగా తయారు చేసి విక్రయిస్తున్నారు. ఇటీవల గంజాయి టెస్టింగ్‌ కిట్ల ద్వారా నగరంలో పలువురు అనుమానితులకు పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్‌ వచ్చిన వారిపై నిఘా పెట్టి లోతుగా విచారణ చేయగా అసలు నిందితులు పట్టుబడ్డారు. నిందితుల అరెస్టులో కీలకంగా పనిచేసిన డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐలు వెంకటేశ్వర్లు, రాగిరి రామయ్య, జయపాల్‌రెడ్డి, శేషగిరి, ఎస్‌ఐలు కరిష్మా, శరత్‌చంద్ర, ఆర్‌ఎస్‌ఐ హనుమంతు, పలువురు పోలీసు సిబ్బందికి ఎస్పీ ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement