ఒకప్పుడు భారీ షెడ్యూల్‌తో కిలోమీటర్ల మేర బస్సులు నడిపి ఆదాయంలో కీలక రీజియన్ గా గుర్తింపు పొందిన అనంతపురం పరిస్థితి నేడు తారుమారు అయింది. ఇప్పుడు ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువయ్యాయి. ఇటీవల ఆర్టీసీ సంస్థ విడుదల చేసిన గణాంకాలే ఇందుకు నిదర్శనం.
● అనంతపురం ఆర్టీసీ రీజియన్ తీరిది
● వార్షిక పనితీరులో మరింత దారుణం
అనంతపురం క్రైం: ఉమ్మడి జిల్లా పరిధిలోని చాలా డిపోల్లో సిబ్బంది కొరత, కాలం చెల్లిన బస్సుల నిర్వహణతో మెయింటెనెన్స్ ఖర్చులు పెరిగాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య లేకపోవడం కూడా ఆర్టీసీ నష్టాలకు కారణమవుతోంది. మొత్తంగా ఈ పరిస్థితి అనంతపురం ఆర్టీసీ రీజియన్‌లో నెలకొంది.
దుస్థితికి అద్దం పట్టిన గణాంకాలు
ఏటా ఫిబ్రవరిలో ఆదాయ, వ్యయాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గణాంకాలు విడుదల చేస్తుంటుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి–2026లో విడుదల చేసిన ‘రీజియన్స్ అండ్ జోన్స్ ఆన్ ప్రాఫిటబిలిటీ’ గణాంకాలు పరిశీలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పాస్ రీయింబర్స్‌మెంట్‌ను కలుపుకుని కోస్తాంధ్ర జిల్లాలు భారీ లాభాలతో ముందంజలో ఉండగా, రాయలసీమ జిల్లాలు ఆర్థిక ఒత్తిడిలోనే కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఫిబ్రవరి నెల గణాంకాల ప్రకారం అనంతపురం రీజియన్ రూ.331.01 లక్షల ఆదాయం గడించగా, గత ఏడాది ఇదే కాలంతో పోల్చుకుంటే సుమారు రూ.220 లక్షల మేర తగ్గుదల ఉండడం గమనార్హం. ఫలితంగా రాష్ట్ర స్థాయిలో అనంతపురం రీజియన్ 13వ స్థానానికి దిగజారింది. అదే సమయంలో కాకినాడ రూ.1,586.66 లక్షలతో అగ్రస్థానానికి ఎగబాకింది. కోనసీమ, విజయనగరం, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాలు కూడా బలమైన లాభాలను నమోదు చేశాయి. ఏడాది సమీకృత లెక్కల్లో అనంతపురం రీజియన్ రూ.3,349.39 లక్షల నష్టాలతో పూర్తిగా వెనుకబడింది. రాయలసీమ పరిధిలోని తిరుపతి, నంద్యాల, చిత్తూరు, శ్రీసత్యసాయి జిల్లాలు కూడా నష్టాల్లో ఉన్నా... అనంతపురం పరిస్థితి మరీ దారుణంగా మారింది.
ప్రైవేట్ పెత్తనంతో ఆదాయానికి గండి
ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలోని గ్రామాల మధ్య దూరం అధికంగా ఉంటోంది. బస్సులు ఎక్కువ కిలోమీటర్లు నడిచినా ప్రతి ట్రిప్‌పై ఆదాయం తక్కువగానే ఉంటోంది. ఈ క్రమంలో ప్రైవేట్ ట్రావెల్స్‌కు అడ్డుకట్ట వేయడంలో ఆర్టీసీ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. బెంగళూరు, హైదరాబాద్, ధర్మవరం, హిందూపురం వంటి రూట్లలో ప్రైవేట్ ట్రావెల్స్ ఆధిపత్యం పెరగడంతో ఆర్టీసీ ప్రయాణికులను కోల్పోతోంది. దీనికి తోడు కాలం చెల్లిన బస్సులు, పెరిగిన నిర్వహణ వ్యయం కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచినా ఒక్క కొత్త బస్సు కూడా కొనుగోలు చేయకపోవడం కూడా ఆర్టీసీ నష్టాలకు కారణమవుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. నష్టాల్లో ఉన్న రూట్లపై ప్రత్యేక సమీక్షలు నిర్వహించడంతో పాటు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా షెడ్యూల్ మార్పు చేస్తూ బస్సులు నడపాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచిస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం పెరిగితే నిర్వహణ ఖర్చులు తగ్గుతాయని, కార్గో సేవల ద్వారా అదనపు ఆదాయం పొందేలా కార్యాచరణను అమలు చేయాలని అంటున్నారు.


