ఎరువుల దుకాణాల తనిఖీ | - | Sakshi
Sakshi News home page

ఎరువుల దుకాణాల తనిఖీ

May 28 2026 1:28 AM | Updated on May 28 2026 1:28 AM

కూడేరు: మండల కేంద్రంలోని పలు ఎరువుల దుకాణాలను విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలు, అమ్మకాల రికార్డులను పరిశీలించారు. రెండు దుకాణాల్లో ఈ–పాస్‌ స్టాక్‌కు, నిల్వకు తేడాలు గుర్తించి, రూ.1,10,271 విలువైన 6.31 టన్నుల ఎరువుల అమ్మకాలను నిలుపుదల చేశారు. కార్యక్రమంలో విజిలెన్స్‌ ఎస్‌ఐ గోపాలుడు, ఏఓ వాసుప్రకాష్‌, మండల ఏఓ శుభకర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

స్కూటీ ఢీ.. వ్యక్తి మృతి

గుత్తి: స్థానిక తాడిపత్రి మార్గంలో స్కూటీ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడిని పామిడి మండలం గజరాంపల్లికి చెందిన నల్లప్ప (45)గా ధ్రువీకరించారు. తాడిపత్రి మార్గంలో రోడ్డు దాటుతుండగా స్కూటీపై వేగంగా దూసుకెళ్లిన మైనర్‌ బాలుడు ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనపై సీఐ రామారావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

వైఎస్సార్‌సీపీ

సానుభూతిపరురాలిపై దాడి

కళ్యాణదుర్గం రూరల్‌: బ్రహ్మసముద్రం మండలం రాయలప్పదొడ్డికి చెందిన మాజీ డీలర్‌, వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు రాము భార్య అచ్చుతపై టీడీపీ నేతలు దాడి చేశారు. గాయపడిన అచ్చుతను చికిత్స నిమిత్తం కళ్యాణదుర్గంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో టీడీపీ నాయకులు లోపలకు చొరబడి తనపై దాడికి పాల్పడినట్లు బాధితురాలు తెలిపారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు ఆస్పత్రికి చేరుకుని బాధితురాలిని పరామర్శించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్లు గోళ్ల సూరి, చంద్రశేఖర్‌రెడ్డి, నాయకులు గణేష్‌, అభిలాష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

వివాహిత దుర్మరణం

యాడికి: ఆటో ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న వివాహిత దుర్మరణం పాలైంది. పోలీసులు తెలిపిన మేరకు... నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం పోదొడ్డి గ్రామానికి చెందిన రమీజా (45) బుధవారం తన కుమారుడు కరీంబాషాతో కలిసి ద్విచక్ర వాహనంపై తాడిపత్రికి వెళ్లారు. అక్కడ పని ముగించుకుని తిరుగు ప్రయాణమైన వారు యాడికి మండలం వేములపాడు వద్దకు చేరుకోగానే ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన ఆటో ఢీకొంది. ఘటనలో రమీజా కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. కరీంబాషా తలకు, కాలికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాసులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి, కేసు నమోదు చేశారు. క్షతగాత్రుడిని ప్రైవేట్‌ వాహనంలో తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

సత్యసాయి సన్నిధిలో

సినీ నటులు

ప్రశాంతి నిలయం: సత్యసాయి బాబా మహా సమాధి దర్శనార్థం సినీ నటులు రాధిక, శరత్‌కుమార్‌ బుధవారం సాయంత్రం పుట్టపర్తికి విచ్చేశారు. రోడ్డు మార్గంలో వచ్చిన వారు నేరుగా శాంతి భవన్‌ చేరుకుని విశ్రాంతి తీసుకున్నారు. గురువారం ఉదయం దర్శన వేళల్లో సత్యసాయి మహా సమాధిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా వారికి ట్రస్ట్‌ సభ్యులు స్వాగతం పలికారు.

Advertisement
 
Advertisement
Advertisement