శిథిల గదుల్లో బోధన ఇంకెన్నాళ్లు? | - | Sakshi
Sakshi News home page

శిథిల గదుల్లో బోధన ఇంకెన్నాళ్లు?

May 28 2026 1:28 AM | Updated on May 28 2026 1:28 AM

విడపనకల్లు: చంద్రబాబు పాలనలో విద్యారంగం నిర్లక్ష్యానికి గురవుతోంది. చాలాచోట్ల శిథిల దశకు చేరుకున్న భవనాల్లోనే పాఠశాలలు నడుపుతున్నారు. వర్షాలకు కారుతున్నా.. పైకప్పు పెచ్చులు ఊడి మీద పడుతున్నా ఉపాధ్యాయులు, విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ ఉండిపోతున్నారు. పయ్యావుల కేశవ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలోని విడపనకల్లు మండలం చీకలగురికి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల దశల వారీగా అప్పర్‌ ప్రైమరీ, ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్‌ అయ్యింది. ఒకటి నుంచి పదో తరగతి వరకు 266 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. ఐదు గదులను ప్రాథమిక పాఠశాలకు.. మూడు గదులు ఉన్నతపాఠశాలకు వినియోగించుకుంటున్నారు. దశాబ్దాల కిందటి ఈ భవనం దెబ్బతింది. పైకప్పు స్లాబ్‌ పెచ్చులూడి.. కడ్డీలు కనిపిస్తున్నాయి. తరగతులు జరుగుతున్న సమయంలోనే పైకప్పు పెచ్చులు ఊడి కిందపడ్డాయి. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని మొన్నటి వరకు వరండాలో చదువులు కొనసాగించారు.

భవన నిర్మాణాలు పూర్తయ్యేదెన్నడో..?

ఉన్నతపాఠశాల నిర్వహణ కోసం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జగనన్న లేఅవుట్‌లో పక్కా భవనాలు మంజూరయ్యాయి. రూ.66లక్షల వ్యయంతో నిర్మాణ పనులు చేపట్టారు. ఆ తర్వాత ఎన్నికలు రావడం.. చంద్రబాబు సర్కారు కొలువు దీరడం.. నిర్మాణ పనులు ఆగిపోవడం జరిగిపోయాయి. రెండు సంవత్సరాలు గడుస్తున్నా పనులు ముందుకు సాగలేదు. ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి సారించడం లేదు. రెండు వారాల తర్వాత బడులు పునఃప్రారంభం కానున్నాయి. నూతన విద్యా సంవత్సరంలో కూడా పక్కా భవనంలోకి వెళ్లే పరిస్థితులు కనిపించం లేదు. చీకలగురికిలోనే కాదు.. మండలంలోని పాల్తూరు, కరకముక్కల, హావళిగి, వి.కొత్తకోట, పొలికి తదితరగ్రామాల్లో కూడా పాఠశాలల భవనాలు, అదనపు తరగతి గదుల నిర్మాణాలు నిలిచిపోయాయి. మంత్రి పయ్యావుల కేశవ్‌ చొరవ తీసుకుని నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.

చీకలగురికి ఉన్నత పాఠశాల తరగతి గదిలో పెచ్చులూడిన దృశ్యం

అర్ధంతరంగా ఆగిపోయిన

భవనాల నిర్మాణం

పూర్తికాని అదనపు తరగతి గదుల నిర్మాణాలు

ఈ విద్యా సంవత్సం కూడా వరండాలోనే పాఠాలు

ఎప్పుడు కూలుతుందో అంటున్న విద్యార్థులు, తల్లిదండ్రులు

ఇదీ మంత్రి పయ్యావుల కేశవ్‌

ఇలాకాలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితి

Advertisement
 
Advertisement
Advertisement