‘ఉపాధి’ అవినీతి లెక్క తేలేనా? | - | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’ అవినీతి లెక్క తేలేనా?

May 28 2026 1:28 AM | Updated on May 28 2026 1:28 AM

కణేకల్లు: జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద 43 ఉడేగోళం గ్రామంలో చేపట్టిన పనుల్లో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలు నిగ్గు తేల్చడంలో జిల్లా అధికార యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తోంది. అవినీతి సొమ్ము తేలిస్తే.. ఇందులో ఫీల్డ్‌ అసిస్టెంట్‌తో పాటు భాగస్వామిగా ఉన్న టీడీపీ నేత నుంచి రికవరీ చేయడం సాధ్యం కాదనే ఉద్దేశంతోనే విచారణను నీరుగారుస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు సర్కార్‌ అధికారంలో వచ్చినప్పటి నుంచి 43 ఉడేగోళం ఫీల్డ్‌ అసిస్టెంట్‌ అనిల్‌కుమార్‌, టీడీపీ నేత పీవీ మారుతిప్రసాద్‌ కుమ్మకై ్క ఉపాధి హామీ పథకాన్ని ఆదాయ వనరుగా మార్చుకున్నారని తెలుస్తోంది. ఈ గ్రామం హెచ్చెల్సీ ఆయకట్టు ప్రాంతం కావడంతో పంట పొలాల్లో పూడికతీత పనులే ఎక్కువ చేశారు. 300 మంది కూలీల్లో 120 మంది పనులకే రారు. అయినా వారు పనులకు వస్తున్నట్లు మస్టర్లు తయారు చేశారు. ఇలా 2024–25 సంవత్సరంలో రూ.65 లక్షలు, 2025–26లో రూ.58లక్షలు, 2026 (ఏప్రిల్‌, మే నెలలు)లో రూ.24.64లక్షలు చొప్పున కూలీలకు వేతనాల రూపంలో చెల్లించారు. కూలి రూపంలో మంజూరు చేయించిన సొమ్ములో వాటాలు పంచుకున్నారు.

పర్యవేక్షణ లోపంతోనే అక్రమాలు

43 ఉడేగోళం గ్రామంలో ఉపాధి హామీ పనులపై జిల్లా అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో అవినీతి అక్రమాలు తారస్థాయికి చేరాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి ఒక పొలంలో పని ప్రారంభిస్తే... ఆ పని పూర్తయ్యేందకు కనీసం వారం, పది రోజుల సమయం పడుతుంది. ఉపాధి కూలీల బిల్లులు వారానికోసారి తయారు చేస్తారు. పని ప్రారంభ సమయంలో ఒక సారి.. పని పూర్తయ్యాక మరోసారి అంటే సోమవారం నుంచి శనివారం వరకు ఏదో ఒక రోజు టెక్నికల్‌ అసిస్టెంట్‌ క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించి కొలతలు తీసుకోవాలి. తర్వాత ఎం.బుక్‌ సిద్ధం చేయాలి. ఇందులో ఉన్నవి కరెక్టా కాదా అని ఇంజినీరింగ్‌ కన్సలెంట్‌(ఈసీ) చెక్‌ మేజర్‌ (పునఃపరిశీలన) చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కరెక్ట్‌గా ఉంటే కంప్యూటర్‌ ఆపరేటర్‌ ద్వారా మస్టర్లు అప్‌లోడ్‌ చేయించి బిల్లులు మంజూరు చేయించాల్సి ఉంది. బిల్లుల మంజూరుకు ఏపీఓ, పీఓ (ఎంపీడీఓ) డీఎస్‌కీ (డిజిటల్‌ సిగ్నేచర్‌ కీ) ఇచ్చి కూలీల బిల్లులు మంజూరు చేస్తారు. ఉపాధి కూలీల బిల్లుల మంజూరుకు కేంద్ర ప్రభుత్వం పారదర్శకతను తీసుకొచ్చినా క్షేత్రస్థాయిలో ఫీల్డ్‌ అసిస్టెంట్లు, టీఏలు, ఈసీలు అక్రమాలకు కొత్తదారులు వెతుక్కుంటుండటంపై ప్రజలు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.

ఫీల్డ్‌ అసిస్టెంట్‌ రాజీనామాతోనే వదిలేస్తారా?

43 ఉడేగోళం గ్రామంలో భారీస్థాయిలో జరిగిన అవినీతి అక్రమాలను నిగ్గు తేల్చకుండా ఫీల్డ్‌ అసిస్టెంట్‌ రాజీనామాతోనే వదిలేస్తారా? అన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. కూలి పనులకెళ్లని వారు ఎంతమంది ఉన్నారు? వారి బ్యాంకు అకౌంట్లకు వంద రోజుల్లో ఎంత డబ్బులు మళ్లించారు.. రెండేళ్లలో ఎంత మొత్తంలో ఉపాధి సొమ్ము పక్కదారి పట్టిందనే విషయాన్ని లోతుగా విచారణ చేసి.. అవినీతి లెక్కలు రికవరీ చేయాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే ఫీల్డ్‌ అసిస్టెంట్‌కు సహకరించిన ఉపాధిహామీ సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటారా.. లేకుంటే వారిని కాపాడుతారా అనేది వేచి చూడాల్సి ఉంది.

మీనమీషాలు లెక్కిస్తున్న అధికార యంత్రాంగం

అక్రమాలు తేలాక.. సొమ్ము రికవరీ సాధ్యమేనా..!

అవినీతికి సహకరించిన టీఏ, ఈసీలపై చర్యలుండవా?

Advertisement
 
Advertisement
Advertisement