కళ్యాణదుర్గం రూరల్: పశ్చిమాసియా దేశాల యుద్ధం కారణంగా నెల క్రితం వరకూ వంట గ్యాస్ కోసం వినియోగదారులు నానా తిప్పలు పడ్డారు. ప్రస్తుతం ఈ సమస్య లేకున్నా... కళ్యాణదుర్గం వాసులు మాత్రం ‘గ్యాస్’ ట్రబుల్‌తోనే ఇబ్బంది పడుతున్నారు. సిలిండర్ల సరఫరా సక్రమంగా ఉన్నా ఏజెన్సీ నిర్వాహకులు కృత్రిమ కొరత సృష్టించి సొమ్ము చేసుకునే ప్రయత్నాలు సాగిస్తుండడమే ఇందుకు కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. బుక్ చేసుకుని 20 రోజులైనా సిలిండర్లను అందజేయడం లేదని వాపోతున్నారు. సిలిండర్ కోసం ఉదయం 6 గంటలకే ఏజెన్సీ వద్దకు చేరుకుంటే మధ్యాహ్నం వరకూ పడిగాపులు కాయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్ణీత ధరకంటే ఎక్కువ చెల్లించిన వారికి క్షణాల్లో సిలిండర్లను ఏజెన్సీ నిర్వాహకులు అందజేస్తున్నారని, ఈ అక్రమాలను ఇప్పటికై నా అధికారులు అరికట్టాలని కోరుతున్నారు.


