గార్లదిన్నె: శక్తి యాప్ వినియోగంతో సంపూర్ణ రక్షణ లభిస్తుందని మహిళలకు ఎస్పీ జగదీష్ సూచించారు. శక్తి యాప్ వినియోగంపై బుధవారం గార్లదిన్నె మండలం మర్తాడు క్రాస్‌లోని పి.కన్వెన్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పోలీసు సేవలపై చైతన్య పరిచారు. సమాజంలో పెరుగుతున్న వివిధ నేరాల నేపథ్యంలో మహిళలు, పిల్లలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో శక్తి యాప్ ద్వారా తక్షణ సాయంపొందే అవకాశముందన్నారు. ఈ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. బాల్య వివాహాలు, పోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్ అరెస్ట్ మోసాలు, లోన్ యాప్ మోసాలు, ఓటీపీ మోసాలు వంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానాస్పద కాల్స్, మెసేజ్‌లు, యాప్‌లకు దూరంగా ఉండాలని, వ్యక్తిగత సమాచారం ఎవరితోనూ పంచుకోకూడదని సూచించారు. ఏదైనా అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. గంజాయి, మారక ద్రవ్యాలు నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ అశ్విన్ మణిదీప్, రూరల్ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు వెంకటేశ్వర్లు, కౌలుట్లయ్య, ఎస్‌ఐలు గౌస్ మహమ్మద్ బాషా, సాగర్, విజయ్‌కుమార్, మహిళా పోలీసులు పాల్గొన్నారు.


