ముమ్మాటికీ కక్ష సాధింపే | - | Sakshi
Sakshi News home page

ముమ్మాటికీ కక్ష సాధింపే

May 27 2026 10:26 AM | Updated on May 27 2026 10:26 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: తన సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్‌ రెడ్డిని రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అక్రమంగా అరెస్టు చేశారని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి ధ్వజమెత్తారు. ఏడాది క్రితం జరిగిన ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామానికి చెందిన మహేశ్వరరెడ్డి ఆత్మహత్య కేసులో అనంతపురం రూరల్‌ పోలీసులు మంగళవారం తెల్లవారుజామున తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డితో పాటు జయపాల్‌రెడ్డి అనే యువకుడిని అరెస్ట్‌ చేశారు. మహేశ్వరరెడ్డిని ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయంటూ వారిని అరెస్టు చేసి..కోర్టులో హాజరుపరిచారు. అయితే..ఇది ముమ్మాటికీ అక్రమ అరెస్టు అంటూ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డితో పాటు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో అనంతపురం రూరల్‌ పోలీసుస్టేషన్‌ ఎదుట నడిరోడ్డుపై బైఠాయించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కూడా ఆందోళనలో పాలుపంచుకున్నారు. అక్రమ అరెస్టులు ఆపాలంటూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి శిఖండి రాజకీయాలు చేస్తోందన్నారు. పరిటాల సునీత ఎమ్మెల్యే అయిన తర్వాత రాప్తాడు నియోజకవర్గంలో మూడు హత్యలు, దళిత బాలికపై సామూహిక అత్యాచారం, అనేక దొమ్మీలు, దోపిడీలు, దాడులు, దౌర్జన్యాలు జరిగాయన్నారు. అయినా ప్రభుత్వం ఏమాత్రమూ పట్టించుకోలేదన్నారు. వీటిని ప్రశ్నిస్తున్న క్రమంలో తమను భయపెట్టేందుకే తన సోదరుడిని అరెస్ట్‌ చేశారన్నారు. ‘మహేశ్వరరెడ్డి మా వాడని గతంలో చెప్పాను.. ఇప్పుడూ చెబుతున్నా. అతను తప్పుదోవలో వెళ్తుంటే రాజశేఖర్‌రెడ్డి చక్కదిద్దాలని చూశారు. అయితే మావైపు ఉన్న కొందరిని పరిటాల శ్రీరామ్‌ తనవైపు తిప్పుకుని మాపై సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేయిస్తున్నాడు. మహేశ్వరరెడ్డిని పరిటాల శ్రీరామ్‌ హత్య చేశాడనే అనుమానం మాకు ఉంది. వారికి అనుకూలంగా లేని సీఐని బదిలీ చేసిన తర్వాత చర్యలకు పూనుకున్నారు. రాజశేఖర్‌రెడ్డిని అరెస్ట్‌ చేస్తే ప్రకాష్‌రెడ్డిని కట్టడి చేయొచ్చని, నియోజకవర్గంలో కేడర్‌ భయపడుతుందని భావించి చేసిన కుట్ర ఇది. రెడ్ల మధ్య పరిటాల కుటుంబం చిచ్చు పెడుతోంది. అవసరమైతే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిని అంతమొందించాలని కూడా చూస్తున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే ఈ కేసును సుమోటోగా తీసుకుని విచారణ చేయిస్తా’మని అన్నారు.

ప్రభుత్వ ఒత్తిడితోనే అక్రమ కేసు!

తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డిపై నమోదు చేసిన కేసు విషయమై నిశితంగా పరిశీలిస్తే ఇది పూర్తిగా అక్రమ కేసు అని పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. మహేశ్వరరెడ్డి ఆత్మహత్య చేసుకున్న రోజు నుంచి ఈ కేసులో తోపుదుర్తి కుటుంబ సభ్యులను చేర్చాలంటూ అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు పోలీసు అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు చేసినట్లు తెలిసింది. ఆత్మహత్య అనేది పూర్తిగా స్పష్టత ఉన్న పోలీసులు అక్రమంగా కేసు నమోదు విషయంలో తర్జనభర్జన పడినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆలస్యం చేశారనే ప్రచారం ఉంది. సీఐ మొదలు జిల్లాస్థాయి అధికారి దాకా ఒత్తిళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే రాప్తాడుకు చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధి నేరుగా డీజీపీ, మంత్రి లోకేష్‌ను కలిసి ఎలాగైనా కేసు నమోదు చేయాలని ఒత్తిడి తెచ్చారనే టాక్‌ నడుస్తోంది. తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి వ్యవహారం, దూకుడు అధికార పార్టీకి చాలా ఇబ్బందిగా ఉందని, కట్టడి చేయకపోతే కష్టమని చెప్పినట్లు సమాచారం. ఇందులో భాగంగానే ముందుగా తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డికి గన్‌మెన్లను తొలగించేలా పావులు కదిపారు. తాజాగా ఆయన సోదరుడిని అక్రమ కేసులో ఇరికించినట్లు తెలుస్తోంది. కాగా రాజశేఖర్‌రెడ్డిపై కేసు నమోదును చాలామంది టీడీపీ నేతలు కూడా తప్పు పట్టినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డి అరెస్టుపై మాజీ ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి నిరసన

పార్టీ శ్రేణులతోరోడ్డుపై బైఠాయింపు

ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు

అక్రమ అరెస్టులకు భయపడబోమన్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత

Advertisement
 
Advertisement
Advertisement