రాయదుర్గం: పశ్చిమాసియా దేశాల యుద్ధ ప్రభావం పేద, మధ్యతరగతి కుటుంబాలను ఇబ్బందుల్లోకి నెట్టింది. కొద్ది రోజులు ఇంధన, గ్యాస్ కొరత ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు నాలుగో దఫా పెంచేశారు. జిల్లాలో 50 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో గృహ, వాణిజ్య గ్యాస్ కనెక్షన్లు 10 లక్షల వరకు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 211 పెట్రోల్ బంకులు ఉన్నాయి. వీటిలో రోజువారీగా పెట్రోల్ 2.60 లక్షలు, డీజిల్ 3.83 లక్షల లీటర్లు వినియోగిస్తున్నారు. డీజిల్‌తో నడిచే భారీ వాహనాలు 17 వేలు, లారీలు 5,100, ట్రాక్టర్లు 14,900, డీజిల్ కార్లు 10 వేలు, ఆటోలు 8 వేలు, పెట్రోల్ కార్లు 4వేల దాకా ఉన్నాయి. అన్ని వస్తువుల ధరలూ పెరిగిపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పేదలపై పెనుభారం
జిల్లాలో ఎక్కువగా వ్యవసాయ కూలీలు, చేనేత కార్మికులు, ఇతర చేతివృత్తిదారులు ఉన్నారు. వీరికి కొద్దిపాటి ధరలు పెరిగితేనే జీవనం కష్టంగా మారుతుంది. ఇప్పటికే ఉప్పు, పప్పులు, నూనెలు, రోజూ వాడే వంట సామగ్రి ధరలు మంటలు రేపుతున్నాయి. ఏది కొనాలన్నా సామాన్యులు భయపడే పరిస్థితి. ఈ క్రమంలో పెట్రోల్, డిజిల్ ధరలు పెరగడంతో రవాణా రంగంపై భారీగా ప్రభావం చూపుతోంది. రవాణా చార్జీలు పెంచడం ద్వారా నిత్యావసర సరుకులు కూడా పెరుగుతున్నాయి. కూరగాయలతో పాటు మాంసం, పండ్లు ఒక్కటేమిటి ధరలన్నీ పెరిగిపోయాయి. నియంత్రించాల్సిన ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి.
ప్రైవేటు బస్సు చార్జీలకు రెక్కలు
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, చైన్నె లాంటి మహా నగరాలకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నడుస్తున్నాయి. కర్ణాటక సరిహద్దున ఉన్న రాయదుర్గం నుంచి జీన్స్ వస్త్ర ఉత్పత్తుల విక్రయాలు కొనసాగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో బస్సు చార్జీలు కూడా అమాంతం పెంచారు. ప్రయాణికులపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది.
వరుసగా నాలుగోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
ఇప్పటికే మంట రేపుతున్న వంటగ్యాస్ సరఫరా
నిలకడలేని నిత్యావసర ధరలు
గగ్గోలు పెడుతున్న పేదలు
పట్టించుకోని ప్రభుత్వాలు


