తాడిపత్రి రూరల్: మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ శాడిజంపై వార్డు సచివాలయ ఉద్యోగుల నిరసనాగ్రహం పెల్లుబికింది. తీవ్ర పనిఒత్తిడి కారణంగా తాడిపత్రి టైలర్స్ కాలనీలోని స్వర్ణ వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ కొర్రపాడు అనిల్‌కుమార్ సోమవారం రాత్రి గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఆయన మృతికి సంతాప సూచికంగా వార్డు సచివాలయ ఉద్యోగులు మంగళవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మానవత్వం మరిచి పని ఒత్తిడి పెంచి పైశాచికత్వం ప్రదర్శిస్తున్న కమిషనర్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేస్తూ మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. ఉన్నతాధికారుల నుంచి కితాబు వస్తే తన వల్లేనని చెప్పుకుంటారని, ఏవైనా లోటుపాట్లు ఉంటే సిబ్బందిని బలిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవసరం నిమిత్తం సెలవు కావాలని కార్యాలయానికి వెళితే గంటల తరబడి బయటే ఉంచి మానసిక వేదనకు గురిచేస్తున్నారని, మహిళా ఉద్యోగుల వ్యక్తిగత ఇబ్బందులను కూడా వినకుండా పని ఒత్తిడి పెంచుతున్నారని తెలిపారు. టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ సమయాల్లో ఉద్యోగులను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని, ఎమ్మెల్యే, మాజీ మున్సిపల్ చైర్మన్ పేర్లు చెప్పి బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు.
4 రోజులూ వర్షాలు
అనంతపురం అగ్రికల్చర్: రాగల నాలుగు రోజులు జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి మంగళవారం తెలిపారు. విశాఖ వాతావరణ కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు ఈనెల 31 వరకు మోస్తరు నుంచి తేలికపాటి వర్షం పడే సూచన ఉందని పేర్కొన్నారు.
ముత్యాలమ్మ దేవరలో తోపులాట
● పోలీసులపై పలువురి దాడి
గుంతకల్లు: క్యూలైన్‌లో భక్తుల మధ్య జరిగిన తోపులాటను నియంత్రిస్తున్న పోలీసులపై పలువురు దాడిచేశారు. జి.కొట్టాలలో వెలసిన ముత్యాలమ్మ ఆలయంలో పూజారి గంగరాజు మంగళవారం దేవర నిర్వహించారు. ఈ సందర్భంగా మాంసాహార విందు ఏర్పాటు చేశారు. పూజారి ఆహ్వానం మేరకు బంధుమిత్రులతో పాటు గ్రామ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ముత్యాలమ్మ భక్తులు వందల సంఖ్యలో తరలివచ్చారు. ముందస్తు జాగ్రత్తగా గుంతకల్లు రూరల్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. సరిగ్గా మధ్యాహ్నం భోజనాల కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లలో భక్తులు కిక్కిరిసిపోవడంతో ఒకరినొకరు తోసుకున్నారు. పరిస్థితి అదుపుతప్పకుండా నియంత్రించేందుకు విధుల్లో ఉన్న హోంగార్డ్ పీరా రంగంలోకి దిగారు. రద్దీని నియంత్రిస్తున్న సమయంలో కోపోద్రిక్తులైన పూజారి బంధువులైన గంగరాజు, నరేష్‌తో పాటు కొందరు భక్తులు హోంగార్డుపై చేయి చేసుకున్నారు. దీన్ని గమనించిన హెడ్‌కానిస్టేబుల్ ఓబుళపతి అడ్డుకునే ప్రయత్నం చేయగా.. ఆయనపైనా దాడిచేసి బట్టలు చించేశారు. ఈ సమయంలో మిగిలిన సిబ్బంది, భక్తులు కల్పించుకుని బాధిత పోలీసులను అక్కడి నుంచి పక్కకు తీసుకురావడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ విషయమై రూరల్ సీఐ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ క్యూలైన్‌లో తలెత్తిన వివాదం కారణంగా హోంగార్డ్, హెడ్‌కానిస్టేబుల్‌పై దాడి చేశారని, బాధితుల ఫిర్యాదు మేరకు గంగరాజు, నరేష్‌పై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశామని చెప్పారు.
సాగుకు సమాయత్తం చేయండి
గుత్తి రూరల్: ఖరీఫ్‌లో తొలకరి జల్లులు పడగానే రైతులను సాగుకు సమాయత్తం చేయాలని వ్యవసాయ శాఖ జేడీ సాలురెడ్డి సూచించారు. పట్టణంలోని సీఎల్‌ఆర్‌సీ భవనంలో మంగళవారం గుత్తి డివిజన్ పరిధిలోని వ్యవసాయ అధికారులు, రైతు సేవ కేంద్రం సిబ్బందితో జేడీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పర్యటించి ఎక్కువ మంది రైతులు విత్తన సాగు చేసేలా సన్నద్ధం చేయాలన్నారు.


