● అనంతలోనూ 70 మందికి పైగా ఆఫ్రికా విద్యార్థులు
● జేఎన్‌టీయూఏ పరిధిలోని ఫార్మసీ కళాశాలల్లో అడ్మిషన్లు
అనంతపురం: ఎబోలా వైరస్ వ్యాప్తితో హెల్త్ ఎమర్జెన్సీ తప్పదనే సంకేతాలు బలపడుతున్నాయి. ఎబోలా వైరస్ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి. ఆఫ్రికా ఖండంలోని కాంగో, ఉగాండా, సూడాన్ దేశాలకు చెందిన 70 మంది విద్యార్థులు జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలోని పలు ఫార్మసీ కళాశాలల్లో బీఫార్మసీ చదువుతున్నారు. ప్రస్తుతం వీరిలో కొంతమంది ఇక్కడ వసతి గృహాల్లో ఉన్నారు. మరికొందరు సొంత దేశాలకు వెళ్లారు. వీరింతా తిరిగి ఆయా కళాశాలలకు త్వరలో రానున్నారు. ఈ నేపథ్యంలో వీరికి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఎబోలా స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారు. నిర్ధారణ అయితే క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందించనున్నారు. అదే విధంగా ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ఆఫ్రికాలోని పలు దేశాల్లో వ్యాపారం, ఉద్యోగాలు చేస్తున్నవారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ నివాసం ఉంటున్న వీరి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. బెంగళూరు అంతర్జాతీయ విమానాల్లో వస్తున్న స్వదేశీ ప్రయాణికులకు సైతం విధిగా పరీక్షలు చేయనున్నారు. విదేశీ ప్రయాణికులతో పాటు స్వదేశీ ప్రయాణికులకు ఎబోలా స్క్రీనింగ్ తప్పనిసరి చేశారు.
ప్రధాన లక్షణాలివీ..
ఎబోలా వైరస్ సోకినప్పుడు ప్రాథమికంగా ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి తీవ్రమయ్యే కొద్దీ అంతర్గత అవయవాలపై ప్రభావం చూపుతుంది. గొంతునొప్పి, విపరీతమైన తలనొప్పి, తీవ్రమైన జ్వరం, అలసట, కండరాల నొప్పులు, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, వ్యాధి ముదిరిన దశలో ముక్కు, నోరు, కళ్ల నుంచి లేదా అంతర్గతంగా రక్తస్రావం అవుతుంది. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న ఎబోలా ’బుండిబుగ్యో’ రూపానికి ఇప్పటి వరకు నిర్దిష్టమైన వ్యాక్సిన్ కానీ, కచ్చితమైన చికిత్స కానీ అందుబాటులో లేదని, అందువల్ల ఇది అత్యంత ప్రమాదకరమైన వ్యాధి అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.


