● ఆత్మకూరులో భారీ వర్షం
● అనంతపురంలో కొబ్బరి చెట్టుపై పిడుగు
● నేలకూలిన వృక్షాలు, విద్యుత్ స్తంభాలు
అనంతపురం అగ్రికల్చర్/ అనంతపురం క్రైం: జిల్లా వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం నుంచి గాలివాన బీభత్సం సృష్టించింది. భయం గొల్పే ఉరుములు, మెరుపులతో పాటు 25 నుంచి 35 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచాయి. అలాగే వరుణుడు తోడు కావడంతో పలు మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదైంది. ఆత్మకూరు మండలంలో 62 మి.మీతో పాటు అనంతపురం, రాప్తాడు, గార్లదిన్నె, బుక్కరాయ సముద్రం, శింగనమల, బెళుగుప్ప, యల్లనూరు, ఉరవకొండ, కూడేరు, బ్రహ్మసముద్రం తదితర మండలాల్లో వర్షం కురిసింది. రాప్తాడు, అనంతపురం, పెద్దపప్పూరు, నార్పల, కూడేరు, బెళుగుప్ప, తాడిపత్రి, ఆత్మకూరు, యల్లనూరు తదితర మండలాల్లో ఈదురుగాలుల ధాటికి పంటనష్టం, ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలవాలాయి. దీంతో అంధకారం అలుముకుంది. అనంతపురంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నవోదయ కాలనీలో ఓ కొబ్బరి చెట్టుపై పిడుగు పడటంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. జీసస్‌నగర్‌లో కూలిన భారీ వృక్షం కారణంగా ప్రభుత్వ సర్వజనాస్పత్రికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.


