రాయదుర్గం టౌన్: స్థానిక మొలకాల్మూరు మార్గంలోని గాంధీ నగర్ కాలనీ, చుట్టుపక్కల కాలనీలకు చెందిన మహిళలు మంగళవారం ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. దాదాపు పది రోజుల తర్వాత నీరు వదిలినా పట్టుమని పది నిమిషాలు కూడా సరఫరా చేయలేదంటూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ ఏఈ నరసింహులు, ఫిట్టర్లు అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో మహిళలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పది నిమిషాలు కూడా నీటిని సరఫరా చేయకపోతే అవసరాలు ఎలా తీరుతాయని నిలదీశారు. ప్రస్తుతానికి ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేస్తామంటూ భరోసానిచ్చి, ఆందోళనను విరమింపజేశారు.
రాధేయకు జాతీయ కవితా పురస్కారం
అనంతపురం కల్చరల్: పల్లా జాతీయ పురస్కారానికి జిల్లాకు చెందిన సీనియర్ కవి ఉమ్మడిశెట్టి రాధేయ ఎంపికయ్యారు. ఈ మేరకు నిర్వాహకులు డాక్టర్ పల్లా కృష్ణ మంగళవారం వెల్లడించారు. రాధేయ రచించిన ‘పావుకోళ్లు’ కవితా సంపుటిని వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన యువసాహితి సంస్థ వారు జాతీయ పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా రాధేయను తెలుగు వెలుగు సాహిత్య సంస్థ, డాక్టర్ ఉమర్‌ఆలీషా సాహితీ సమితి ప్రతినిధులు అభినందించారు.
ఫోన్ హ్యాక్..
బ్యాంకు ఖాతాలు ఖాళీ
డి.హీరేహాళ్(బొమ్మనహాళ్): ఓ వ్యక్తి ఫోన్‌ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు... అతని బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేసేశారు. బాధితుడు తెలిపిన మేరకు.. డి.హీరేహాళ్ మండలం హోసగుడ్డం గ్రామానికి చెందిన వ్యక్తి అదే మండల కేంద్రానికి సమీపంలోని ఓ కర్మాగారంలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 22న అతడి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతా నుంచి రూ. 97 వేలు, 24న కెనరా బ్యాంకు ఖాతా నుంచి మరో రూ. 45,800 మాయమయ్యాయి. మొబైల్‌కు వరుసగా అందిన ఎస్‌ఎంఎస్‌లు చూసి బాధితుడు ఉలిక్కిపడ్డాడు. తన ఫోన్ హ్యాక్ అయినట్లుగా గుర్తించి, వెంటనే బ్యాంక్ అధికారులను సంప్రదించాడు. సైబర్ నేరగాళ్లు ఫోన్ హ్యాక్ చేసి నగదు కాజేసినట్లుగా నిర్ధారించుకుని పోలీసులను ఆశ్రయించాడు.
విద్యుదాఘాతంతో
కూలీ మృతి
ఉరవకొండ: మండలంలోని నెరిమెట్ల గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ వన్నూరుస్వామి (41) విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. ఆయనకు భార్య సురేష్, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. మంగళవారం ఉదయం ఇంటి పైభాగంలో ఉన్న ఇనుమ చువ్వలను కిందకు దించే క్రమంలో ఆ పక్కనే విద్యుత్ తీగలు తగిలి షాక్‌కు గురై కింద పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఉరవకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి
బెళుగుప్ప: వడదెబ్బ సోకి ఓ ఉపాధి కూలీ మృతి చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు.. బెళుగుప్పలోని ఫాదర్ ఫెర్రర్ కాలనీలో నివాసముంటున్న బోరంపల్లి శివ(36)కు భార్య లలిత, ఓ కుమారుడు, కుమార్తె, తల్లి వన్నూరమ్మ ఉన్నారు. కూలి పనులతో జీవనం సాగిస్తున్నారు. సోమవారం ఉదయం గ్రామ శివారున చేపట్టిన ఉపాధి పనుల్లో పాల్గొన్న శివ... మధ్యాహ్నానికి తీవ్ర అస్వస్థతకు లోనై ఇంటికి చేరుకున్నాడు. కోలుకోలేకపోవడంతో మంగళవారం ఉదయం కళ్యాణదుర్గంలోని ప్రభుత్వాస్పత్రికి కుటుంబసభ్యులు తీసుకెళుతుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. వడదెబ్బ కారణంగా మృతి చెందినట్లుగా గ్రామస్తులు తెలిపారు. ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
పీఎం సూర్యఘర్ పనులు వేగవంతం చేయండి
అనంతపురం టౌన్: పీఎం సూర్యఘర్ పనులు వేగవంతం చేయాలంటూ విద్యుత్ శాఖ అధికారులను ఆ శాఖ ఎస్‌ఈ శేషాద్రి శేఖర్ ఆదేశించారు. సంబంధిత అధికారులతో మంగళవారం ఆయన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. మండలాలు యూనిట్‌గా ఎస్సీ, ఎస్టీల ఇళ్లపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు పనులు ఎంత వరకు వచ్చాయని ఆరా తీశారు. కాంట్రాక్టర్లతో చర్చించి జూన్ ఆఖరులోపు 100 శాతం పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. ఆర్‌డీఎస్‌ఎస్ పనులపై రోజు వారీ నివేదికలు సేకరించాలన్నారు.


