అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్ పంటల సాగుకు సంబంధించి కీలక సమయంలో ఎరువుల సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు, రోజువారీ పర్యవేక్షణ కొనసాగించాలని వ్యవసాయశాఖ జేడీ ఎన్.సాలురెడ్డి ఆదేశించారు. మంగళవారం నగరంలోని వ్యవసాయశాఖ కార్యాలయం నుంచి ఏడీఏలు, ఏవోలతో ఆయన గూగుల్ మీట్ నిర్వహించారు. ఎల్–నినో వాతావరణ పరిస్థితులు ఉన్నందున ప్రకృతి పద్ధతుల్లో పంటలు సాగు చేయించేలా రైతులను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. ష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నందున పీఎండీఎస్, హాప్‌మూన్ పద్ధతులు రైతులు పాటించేలా చూడాలన్నారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 2 లక్షల ఎకరాల్లో పీఎండీఎస్ కింద పంటలు వేయించాలన్నారు. త్వరలోనే విత్తన పంపిణీ మొదలు పెట్టనున్నట్లు తెలిపారు. ప్రధానంగా గతేడాది ఉత్పన్నమైన ఎరువుల సమస్యను దృష్టిలో ఉంచుకుని ఎరువుల సరఫరా, అమ్మకాలపై రోజువారీ నిఘా ఉంచాలన్నారు. అందులోనూ యూరియా, డీఏపీ ఇష్టారాజ్యంగా అమ్మకాలు జరగకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు. డిమాండ్ ఉన్న ఆర్‌ఎస్‌కేల్లో తగినంత ఎరువులు నిల్వ చేసుకోవాలన్నారు. మార్క్‌ఫెడ్ దగ్గర బఫర్‌స్టాక్ ఎక్కువగా ఉన్నందున ఇండెంట్ ఇవ్వాలని తెలిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఏవోలు, ఏఈవోలు, ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్లు రైతులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
భారీగా గంజాయి స్వాధీనం
అనంతపురం సెంట్రల్: నగర శివారులోని టీవీ టవర్ సమీపంలో ఉన్న పలు కాలనీలో మంగళవారం వన్‌టౌన్ పోలీసులు నాకాబందీ చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తుల ఇళ్లను తనిఖీ చేశారు. షికారీల ఇళ్లలో భారీగా నిల్వ చేసిన గంజాయిని గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని నిల్వ చేసిన వారిని స్టేషన్‌కు తరలించి, విచారణ చేస్తున్నారు.
ఇద్దరి అరెస్ట్
గార్లదిన్నె: పంట పొలాల్లో డ్రిప్ ల్యాడర్, పరికరాలను అపహరించుకెళుతున్న ఇద్దరిని అరెస్ట్ చేసి, రూ.50 వేలు విలువ చేసే డ్రిప్ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు గార్లదిన్నె పోలీసులు తెలిపారు. వివరాలను మంగళవారం వారు వెల్లడించారు. ఈ నెల 5న ముంటిమడుగు గ్రామంలో రైతు తమ్మినేని కోదండ పొలంలో డ్రిప్పు పరికరాలు చోరీకి గురయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా పక్కా ఆధారాలతో ముంటిమడుగు కొత్తూరుకు చెందిన నరసింహులు, శ్రీనివాసులును అరెస్ట్ చేసి, డ్రిప్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.


