‘ఉపాధి’ అక్రమాలపై విచారణ | - | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’ అక్రమాలపై విచారణ

May 26 2026 3:26 AM | Updated on May 26 2026 3:26 AM

కణేకల్లు: మండలంలోని 43 ఉడేగోళంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణ మొదలైంది. అధికార టీడీపీ నేత అండదండలతో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ మస్టర్లు మాయ చేసి.. కూలీల హాజరు అమాంతం పెంచేసి.. వచ్చిన కూలి సొమ్ము స్వాహా చేస్తుండటంపై ‘కూలీల సొమ్ముకు కన్నం’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీనికి డ్వామా పీడీ స్పందించి, విచారణకు ఆదేశించారు. సోమవారం కళ్యాణదుర్గం డివిజన్‌ ఏపీడీ రాజారావు గ్రామంలో పర్యటించారు. సచివాలయంలోకి కూలీలను పిలిపించి విచారణ చేశారు. అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా తేలింది.

నాటకీయంగా ఫీల్డ్‌ అసిస్టెంట్‌ రాజీనామా

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో చోటు చేసుకొన్న అక్రమాలు వెలుగులోకి రావడంతో 43 ఉడేగోళం ఫీల్డ్‌ అసిస్టెంట్‌ అనిల్‌కుమార్‌ సోమవారం తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ వ్యక్తిగత కారణాల రీత్యా రాజీనామా చేస్తున్నానని, తన రాజీనామాను అంగీకరించాలంటూ ఎంపీడీఓ విజయసింహారెడ్డి, ఏపీఓ సుధాకర్‌కు లేఖ సమర్పించారు.

సమగ్ర విచారణ చేస్తాం: ఏపీడీ

43 ఉడేగోళంలో ఉపాధి హామీ పనుల్లో చోటు చేసుకొన్న అక్రమాలపై సమగ్ర విచారణ చేపడతామని కళ్యాణదుర్గం డివిజన్‌ ఏపీడీ రాజారావు పేర్కొన్నారు. గ్రామంలో కూలీలతో విచారణ చేపట్టిన అనంతరం ఆయన ఎంపీడీఓ కార్యాలయంలో ‘సాక్షి’తో మాట్లాడారు. ఉపాధి పనుల్లో అక్రమాలు జరిగాయని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. సెల్‌ఫోన్‌లో ముందుగానే తీసుకున్న ఫొటోలను సెల్‌ఫోన్‌పై మరో సెల్‌ఫోన్‌ కెమెరా ఆన్‌ చేసి ఫోటోలు తీసి అప్‌లోడ్‌ చేసినట్లు గుర్తించామన్నారు. ఎన్‌ఎంఎంఎస్‌ యాప్‌లో వారం రోజుల ఫోటోలు మాత్రమే ఉంటాయని, పూర్తిస్థాయిలో విచారణ చేయాలంటే బ్యాక్‌ ఫీడ్‌ అవసరమన్నారు. ప్రాథమిక విచారణ నివేదికను పీడీకి సమర్పిస్తామన్నారు.

పక్కా ప్లాన్‌తోనే తప్పించారా?

ఉపాధి పనుల మస్టర్ల తయారీలో మాయ చేశారు. కూలీల హాజరు, ఫొటోల అప్‌లోడ్‌లో అక్రమాలకు పాల్పడ్డారు. క్షేత్రస్థాయిలో టెక్నికల్‌ అసిస్టెంట్‌ కొలతలు వేసి.. పనులు ఎంతమేరకు జరిగాయో ఎం.బుక్కులో రికార్డు చేయాలి. ఆ వివరాల ప్రకారం ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్‌ (ఈసీ) పనులు పరిశీలన చేయాలి. అయితే ఎవ్వరూ పరిశీలన చేయడం కానీ, అక్రమాలు గుర్తించకుండా అంతా సవ్యంగా ఉన్నట్లు ఆమోదం తెలిపారు. ఇప్పుడు ఈ అక్రమాలన్నీ బహిర్గతం కావడంతో తమ మెడకు చుట్టుకోకుండా ఉండేందుకు ఫీల్డ్‌ అసిస్టెంట్‌తో రాజీనామా చేయించి అధికారులు ముందుజాగ్రత్త పడినట్లు సమాచారం. ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం నుంచి తప్పుకుంటే తాము కూడా సేఫ్‌ కావొచ్చని పక్కా ప్లాన్‌ వేశారని తెలుస్తోంది.

43 ఉడేగోళంలో విచారణ చేపట్టిన ఏపీడీ

ముందుగా తీసుకున్న ఫొటోలే మళ్లీ మళ్లీ అప్‌లోడ్‌

మస్టర్లు, ఎం.బుక్‌ నమోదులో అన్నీ అవకతవకలే

ఫీల్డ్‌ అసిస్టెంట్‌ రాజీనామా

Advertisement
 
Advertisement
Advertisement