అనంతపురం టవర్‌క్లాక్: ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈ నెల 30న స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి తెలిపారు. ఈ మేరకు ఆమె సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సమావేశ భవన్‌లో జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన ఒకటి నుంచి ఏడు వరకు స్థాయీ సంఘాల సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులు సమగ్ర సమాచారంతో హాజరు కావాలని సూచించారు.
రేపటి నుంచి కలెక్టర్ సెలవులోకి..
అనంతపురం అర్బన్: కలెక్టర్ ఆనంద్ వ్యక్తిగత పనుల నిమిత్తం బుధవారం నుంచి ఈ నెల 30 వరకు సెలవుపై వెళ్లనున్నారు. అప్పటి వరకు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ ఇన్‌చార్జ్ కలెక్టర్‌గా వ్యవహరించనున్నారు.
ప్రశాంతంగా టెన్త్
సప్లిమెంటరీ పరీక్షలు
అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. తెలుగు పరీక్షకు జిల్లాలో 34 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 4,039 మంది విద్యార్థులకు గాను 3,161 మంది హాజరయ్యారు. అలాగే ఓపెన్ స్కూల్ పదో తరగతి పరీక్షకు 364 మందికి గాను 314 మంది, ఇంటర్ పరీక్షకు 298 మందికి గాను 252 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఇన్‌చార్జ్ డీఈఓ శ్రీనివాసరావు తెలిపారు.
డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి
అనంతపురం అర్బన్: జిల్లా రెవెన్యూ శాఖలో ఇద్దరు తహసీల్దార్లు ఎ.హరికుమార్, పి.విజయకుమారికి డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. హరికుమార్ ప్రస్తుతం రాయదుర్గం తహసీల్దారుగా ఉన్నారు. విజయకుమారి రాప్తాడు తహసీల్దారుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చేంత వరకు వీరు ప్రస్తుత స్థానాల్లోనే కొనసాగుతారు.
తాగునీటి ఇబ్బంది రాకూడదు
● కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌లు పూర్తి చేయాలి
● అధికారులకు జేసీ విష్ణుచరణ్ ఆదేశం
అనంతపురం అర్బన్: ప్రజలకు తాగునీటి ఇబ్బంది రాకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా వాటర్ అండ్ శానిటేషన్ మిషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జూలై నెల వరకు ఎక్కడా తాగునీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీటికి సంబంధించి రూ.50 లక్షలు నిధులు మంజూరయ్యాయన్నారు. ఎంపీడీఓలు క్షేత్రస్థాయిలో పర్యటించి తాగునీటి సరఫరాకు సంబంధించిన పనులు గుర్తించి ప్రతిపాదనలు పంపించడంతో పాటు మంజూరు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో, వసతిగృహాల్లో నీటి పరీక్షలు ఎప్పటికప్పుడు నిర్వహించాలన్నారు. స్వచ్ఛభారత్ మిషన్ కింద మంజూరైన 940 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని చెప్పారు. పాఠశాలలు, వసతిగృహాల్లో, గురుకుల పాఠశాలల్లో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌ల నిర్మాణాల పనులు పాఠశాలలు పునఃప్రారంభమయ్యేలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. దేవాలయాలు, తహసీల్దారు కార్యాలయాలు. అంగన్‌వాడీ కేంద్రాల్లో, బస్టాండు, తదితర అవసరమైన ప్రాంతాలు, మండల సమాఖ్యల్లో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌ల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కె.శ్రీనివాసులు, జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి, డీపీఓ నాగరాజు నాయుడు, డ్వామా పీడీ సలీంబాషా, డీఈ చంద్రశేఖర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.


