● బకాయిలు ఇవ్వకపోవడంతో మొదలుకాని విత్తనశుద్ధి
● రైతుల కోసం రూ.90 కోట్లు ఇవ్వని సీఎం చంద్రబాబు
అనంతపురం అగ్రికల్చర్: కీలకమైన ఖరీఫ్ వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడానికి ఆరు రోజులు మాత్రమే సమయం ఉంది. ఇటీవల జిల్లా అంతటా మోస్తరుగా తొలకరి వర్షాలు పలకరించాయి. దీంతో రైతులు పొలంబాట పట్టి సాగుకు సమాయత్తమతువున్నారు. వేసవి ఇంకా కొనసాగుతుండటం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల నైరుతి రుతుపవనాలు అండమాన్‌లో ఆగిపోయినట్లు వాతావరణ శాఖ చెబుతోంది. నెలాఖరు లేదా జూన్ ఒకట్రెండు తేదీల్లో రుతుపవనాల ప్రభావంతో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. ఉమ్మడి జిల్లాలో వర్షాధారంగా 6.75 లక్షల హెక్టార్ల భారీ విస్తీర్ణంలో పంటలు సాగులోకి రానున్నాయి. అయితే ఖరీఫ్ విత్తన ప్రణాళిక, కార్యాచరణ కాగితాలకే పరిమితం కావడంతో ఈసారి కూడా రైతులకు విత్తనం సకాలంలో అందే పరిస్థితి కనిపించడం లేదు.
విత్తన పంపిణీపై నిర్లక్ష్యం
ఖరీఫ్ పంటల సాగు కోసం జిల్లాకు 56,423 క్వింటాళ్ల విత్తనం కేటాయించారు. అలాగే క్వింటా విత్తన వేరుశన పూర్తి ధర రూ.10,200కు పెంచేసి.. అందులో 40 శాతం రాయితీ పోను రైతులకు రూ.6,120 ప్రకారం పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించారు. సేకరించే బాధ్యతలు ఏపీ సీడ్స్ తీసుకోగా... విత్తనశుద్ధి చేసి సరఫరా చేయాలని అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాలో ఉన్న 24 ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్వాహకులకు హుకుం జారీ చేశారు. నాణ్యతా ప్రమాణాలు కూడా నిర్దేశించారు. అయితే గత ఖరీఫ్, రబీకి సంబంధించి విత్తనం సరఫరా, ప్రాసెసింగ్ బకాయిలు రూ.90 కోట్లు చెల్లిస్తే కానీ విత్తనశుద్ధి మొదలు పెట్టేది లేదని మిల్లర్లు తెగేసి చెబుతున్నారు. బకాయిల చెల్లింపు గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోకపోవడంపై రైతులు పెదవి విరుస్తున్నారు.
● ఇటీవల కొందరు రైతులు మందుస్తు సాగుకు సిద్ధమయ్యారు. వర్షాలపై నమ్మకం లేని రైతులు జూన్ మొదటి వారంలోనే వేరుశనగ, ఆముదం, కంది, పత్తి లాంటి పంటలు విత్తుకోవాలని భావిస్తున్నారు. అంతలోపు విత్తనం అందించాల్సిన చంద్రబాబు ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించడం పట్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్–నినో ఎఫెక్ట్ నేపథ్యంలో ప్రత్యామ్నాయ విత్తనం, పంటల ప్రణాళిక అమలు చేస్తామని చెబుతున్నా... ఇప్పటి వరకు ఎలాంటి సన్నాహక చర్యలూ చేపట్టకపోవడం గమనార్హం.


