క్లుప్తంగా
సంపూర్ణ అక్షరాస్యత
లక్ష్యం : జేసీ
అనంతపురం అర్బన్: సంపూర్ణ అక్షరాస్యత సాధించే లక్ష్యంగా అక్షరాంధ్ర రెండవ దశ కార్యక్రమాన్ని అమలు చేయాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ ఆదేశించారు. అక్షరాంధ్ర ఫేజ్–2 కార్యక్రమం అమలు, లక్ష్యాలు, కార్యక్రమ షెడ్యూల్, యాప్ అనుసంధాన ప్రక్రియ, తదితర అంశాలపై సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశం జేసీ మాట్లాడారు. జిల్లాలో 1.34 లక్షల మంది నిరక్ష్యరాస్యులను అక్షరాస్యులుగా మార్చేలా లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్ధేశించిందన్నారు. ప్రతి శాఖ సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ విజయ లక్ష్మి, డీపీఓ నాగరాజునాయుడు, ఎస్‌జీఎస్‌డబ్ల్యూ అధికారి నాసరరెడ్డి, డ్వామా పీడీ సలీమ్‌బాషా, వయోజన విద్యాశాఖ డీడీ వెంకటేశ్వర్లు, సీపీఓ అశోక్‌కుమార్, డీఐపీఆర్‌ఓ బాలకొండయ్య, మెప్మా పీడీ విశ్వజ్యోతి, ఐసీడీఎస్ పీడీ శశికళ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మత్స్యశాఖ డీడీగా విజయకృష్ణ
అనంతపురం అగ్రికల్చర్: మత్స్యశాఖ జిల్లా ఉప సంచాలకులు (డీడీ)గా ఎం.విజయకృష్ణ నియమితులయ్యారు. విశాఖపట్నం జిల్లా మత్స్యశాఖ ఏడీగా ఉన్న ఆయనకు పదోన్నతిపై జిల్లాకు బదిలీ చేస్తూ ఆ శాఖ కమిషనరేట్ నుంచి సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. రెండు మూడు రోజుల్లో ఆయన బాధ్యతలు తీసుకోనున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఇన్‌చార్జ్ డీడీగా శ్రీసత్యసాయి జిల్లా ఏడీ చంద్రశేఖర్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు.
యాడికి: మండలంలోని కేశవరాయునిపేట సమీపంలో ఉన్న సుంకులమ్మ ఆలయంలో ఆదివారం రాత్రి దుండగులు చొరబడి అమ్మవారి మూలవిరాట్‌ను అలంకరించిన 40 తులాల వెండి కిరీటం, ఆభరణాలను అపహరించారు. సోమవారం ఉదయం ఆలయానికి చేరుకున్న పూజారి నారాయణమ్మ చోరీ విషయాన్ని గుర్తించి సమాచారం ఇవ్వడంతో సీఐ శ్రీనివాసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. దాదాపు 40 కిలోల బరువైన వెండి ఆభరణాలను అపహరించికెళ్లినట్లుగా నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేశారు.
ఆలయంలో చోరీ
పెద్దవడుగూరు: మండలంలోని లక్ష్ముంపల్లిలో వెలసిన పెద్దమ్మ ఆలయంలో చోరీ జరిగింది. ఆదివారం రాత్రి ఆలయంలోకి చొరబడిన దుండగులు అమ్మవారి వెండి ప్రతిమ, 500 గ్రాముల వెండి గొడుగు, 5 గ్రాముల బంగారు తాళిబొట్లను అపహరించారు. ఉదయాన్నే గుడికి వెళ్లిన భక్తులు చోరీ విషయాన్ని గుర్తించి సమాచారం ఇవ్వడంతో సీఐ రామసుబ్బయ్య, ఎస్‌ఐ ఆంజనేయులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. పూజారి గురుస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.


