మూగజీవాల ఆకలిచావులు | - | Sakshi
Sakshi News home page

మూగజీవాల ఆకలిచావులు

May 26 2026 3:26 AM | Updated on May 26 2026 3:26 AM

అనంతపురం అగ్రికల్చర్‌: ప్రతి ఆదివారం అనంతపురంలోని మార్కెట్‌ యార్డులో పశువుల సంత జరుగుతుంది. జిల్లా నుంచే కాకుండా కర్నూలు, కర్ణాటక, తమిళనాడు, కేరళ ప్రాంతాల నుంచి రైతులు, వ్యాపారులు వస్తుంటారు. పెద్ద ఎత్తున పశువులు, గేదెలు, జీవాల క్రయవిక్రయాలు సాగుతుంటాయి. ఈ ఏడాది సరైన వర్షాలు లేకపోవడానికి తోడు పంటల సాగు విస్తీర్ణం తగ్గి పశుగ్రాసం కొరత నెలకొంది. దీంతో బళ్లారి, కర్నూలు, నంద్యాల, కణేకల్లు ప్రాంతాల నుంచి వరిగడ్డి కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నా చాలడం లేదంటున్నారు. ఇలాంటి తరుణంలో రైతులకు గడ్డి, దాణా, టీఎంఆర్‌ సరఫరా చేయడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగా ఆకలితో అలమటిస్తున్న పశువులను చూడలేక విక్రయానికి పెడుతున్నట్లు తెలిపారు.

పట్టించుకునే వారేరి?

ప్రతి వారమూ అనంతపురం మార్కెట్‌ యార్డు నుంచి కబేళాలకు పశువులు, గేదెలు, దున్నలు, ఎద్దులను తరలిస్తున్నారు. పెంచి పోషించిన పాడి ఆవులు, గేదెలను సైతం గడ్డి లేక అయినకాటికి అమ్ముకుంటున్న దుస్థితి నెలకొంది. వీటికి తోడు ఈసారి ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీల వరకు దాదాపు మూడు నెలల పాటు మండిపోవడంతో మనుషులతో పాటు పశుసంపద, ఇతర మూగజీవాలూ అలమటించాయి. తాగునీటికి కూడా చాలా ప్రాంతాల్లో ఇబ్బందులు ఏర్పడటంతో పశుసంపద, జీవ సంపద మనుగడ సమస్యగా మారింది. ఈ క్రమంలో ఈ నెల 24న (ఆదివారం) సంతకు విక్రయానికి తెచ్చిన ఓ పశువు, గేదె చనిపోవడంతో రైతులు అక్కడే వదిలేసిపోయారు. ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నా... వెలుగు చూడకుండా అధికారులు తొక్కి పెడుతున్నారనే ఆరోపణలున్నాయి. పశువులు చనిపోయి రైతులకు నష్టం వాటిల్లుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు.

మేత లేక భారమైన పశుపోషణ

అయినకాటికి అమ్ముకునేందుకు సిద్ధమైన రైతులు

ఈ లోపు ఆకలితో చనిపోతున్న పశువులు

వ్యవసాయాధారితమైన అనంతపురం జిల్లాలో మూగజీవాల ఆకలి చావులు హృదయవిదారకంగా మారాయి. వెలుగు చూస్తున్నవి కొన్నయితే.. వెలుగు చూడనవి మరిన్ని ఉంటున్నాయి. ఓ వైపు మండే ఎండల ప్రభావం కారణంగా దాహంతో అలమటిస్తున్న పశువులు, జీవాలు.. చివరకు మేత కరువై మృత్యువాత పడుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement